బలవంతపు భూసేకరణ ఆపాలి

7 Nov, 2016 21:13 IST|Sakshi
బలవంతపు భూసేకరణ ఆపాలి
ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం
ప్రధాన కార్యదర్శి పెద్దారెడ్డి డిమాండ్‌
 
వడ్డేశ్వరం (తాడేపల్లి రూరల్‌): రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం తలపెట్టిన బలవంతపు భూసేకరణ వెంటనే నిలుపు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పుల్లా పెద్దారెడ్డి అన్నారు. సోమవారం వడ్డేశ్వరంలోని రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ కంపెనీల కోసం రైతుల నుంచి భూమి సేకరించడం, పెద్దలకు కట్టబెట్టడం వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. మిగులు భూములు, బంజరు భూమిని పేదలకు పంచాలని, సమగ్ర భూసంస్కరణలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే విత్తన చట్టాన్ని తేవాలని కోరారు. కల్తీ విత్తనాలను అరికట్టి బహుళ జాతి కంపెనీల ప్రమేయాన్ని తగ్గించాలని ఆయన కోరారు. 
 
ప్రభుత్వం 245 కరువు మండలాలను ప్రకటించిందని, కానీ తమ పరిశీలనలో మరో 150 మండలాలు తేలాయని, మొత్తం 395 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. గత ఖరీఫ్‌లో 400 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం ఇంత వరకు రైతులకు చెందాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదని విమర్శించారు. భూసేకరణకు వ్యతిరేకంగా వామపక్ష నాయకులు, రైతుల మీద ప్రభుత్వ అణచివేతను నిరసిస్తూ డిసెంబర్‌ 12న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఛలో కలెక్టర్‌ కార్యాలయం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. రైతులను రక్షించండి – వ్యవసాయాన్ని కాపాడండి ’ అనే నినాదంతో ఈ నెల 9,10,11 తేదీలలో అఖిల భారత కిసాన్‌ సభ జాతా రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్క రైతు ఆ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై కేశవరావు, రైతువాణి చీఫ్‌ ఎడిటర్‌ వంగల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా