రొయ్య.. అదిరిందయ్యా

28 Aug, 2017 10:19 IST|Sakshi
రొయ్య.. అదిరిందయ్యా

దిగుబడి తగ్గడంతోధరల పెరుగుదల
సగంపైగా తగ్గిన ఎగుమతులు
25 కౌంట్‌ కిలో రూ.540
వైరస్‌ దెబ్బతో చెరువులు ఖాళీ


భీమవరం: జిల్లాలో రొయ్యల రైతులకు మంచిరోజులు వచ్చాయి. రొయ్యల ధరలు మీసం మెలేస్తున్నాయి. నెల రోజులుగా ధరలు పెరుగుదలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన రొయ్యల సాగు విస్తీర్ణం, తెగుళ్లు దాడి, మే నెల నుంచి పడిపోయిన ధరలతో దిగాలు పడిన రైతులు ప్రస్తుత ధరలతో ఊరట చెందుతున్నారు. ప్రస్తుతం 25 కౌంట్‌ కిలో రొయ్యలు రూ.540, 30 కౌంట్‌ రూ.450, 100 కౌంట్‌ రూ.250 పలుకుతోంది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నా రైతులు వద్ద సరుకు అంతంత మాత్రంగానే ఉందని తెలిసింది. ఇప్పటిధరలతో మరింత వేగంగా సాగుకు ఉపక్రమించాలని రైతులు భావిస్తున్నారు.

జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో..
జిల్లాలో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా దాదాపు 50 వేల ఎకరాలకు పైగా రొయ్యలు సాగు చేస్తున్నట్టు అంచనా. ఏడాది మొదట్లో రొయ్యల ధరలు ఆశాజనకంగా ఉండటంతో చాలా మంది డెల్టాలోని మూడు పంటలు పండే సారవంతమైన భూములను సైతం రొయ్యల చెరువులుగా మార్చేశారు. చెరువుల తవ్వకంపై ఆంక్షలున్నా  కొందరు రెవెన్యూ, వ్యవసాయశాఖ, మత్స్యశాఖ అధికారులకు పెద్దమొత్తంలో ముడుపులు ముట్టచెప్పి ప్రసన్నం చేసుకుని మరీ చెరువులు తవ్వినట్టు తెలుస్తోంది. ఇలా ఈ ఏడాది వేసవిలో భీమవరం, పాలకొల్లు, ఉండి, ఆచంట, ఉంగుటూరు, తణుకు తదితర అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు 10 వేల ఎకరాలకు పైగా చెరువులు తవ్వినట్టు అంచనా.

తెగుళ్ల దాడి
గతంలో టైగర్‌ రకం రొయ్యలు సాగు చేసిన రైతులు తెగుళ్ల బారిన పడుతుండటంతో వనామీ సాగు చేపట్టారు. మంచి లాభాలు ఆర్జించిన రైతులు ఎక్కువ విస్తీర్ణంలో రొయ్యల సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మేలో వనామీ రొ య్యలు సైతం వైరస్, వైట్‌స్పాట్‌ తెగుళ్లు సోకి చనిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. సీడ్‌ వేసిన నెలలోపు రొయ్యల పిల్లలు మృత్యువాతపడటంతో పెట్టుబ డులు సైతం దక్కక నష్టపోయారు.

తెగు ళ్లు కారణంగా పట్టుబడులు పెరిగిపోవడంతో రొయ్యల కొనుగోలుదారులు సిం డికేటుగా మారి ధరలను మరింత తగ్గించి వేశారు. వాతావరణం అనుకూలించకపోవడం, తెగుళ్లు కారణంగా పలువురు రైతులు తిరిగి సీడ్‌ వేయకుండా చెరువులను ఖాళీగానే ఉంచేశారు. ప్రస్తుతం రొయ్యల పట్టుబడులు అంతంతమాత్రంగానే ఉండటంతో మరింత ధర పలుకుతోంది. అక్కడక్కడా కొందరు రై తులు అత్యంత జాగ్రత్తగా పెంచి, పోషిం చిన రొయ్యలను ప్రస్తుతం పట్టుబడులు పడుతుంటే వ్యాపారులు హెచ్చుధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ ధరలు మ రింత పెరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు