తోక జాడిస్తే తోలుతీస్తా

13 Sep, 2016 23:06 IST|Sakshi
తోక జాడిస్తే తోలుతీస్తా

రౌడీషీటర్లకు నాల్గవ పట్టణ ఎస్‌ఐ శ్రీరామ్‌ హెచ్చరిక
చంద్రదండు ప్రకాష్‌నాయుడుతో సహా 33 మందికి కౌన్సెలింగ్‌


అనంతపురం సెంట్రల్‌ : ‘‘దందాలు, దౌర్జన్యాలకు దూరంగా మంచిగా జీవించండి. నేనూ మంచిగా ఉంటా. లేదని తోక జాడిస్తే మాత్రం తోలుతీస్తా’నని అనంతపురం నాల్గవ పట్టణ ఎస్‌ఐ శ్రీరామ్‌ రౌడీషీటర్లను హెచ్చరించారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్‌నాయుడుతో సహా 33 మంది రౌడీషీటర్లకు తనదైన శైలిలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. స్టేషన్‌ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే చూస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

నెలరోజుల్లోపు స్టేషన్‌ పరిధిలోని ప్రాంతాల్లో మార్పు రావాలని, ప్రశాంతవాతావరణం వచ్చేలా సహకరించాలని సూచించారు. ప్రతి నెలా ఒకటో తేదీన రౌడీషీటర్లు తప్పనిసరిగా స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలన్నారు. ఏ ఒక్కరు నిర్లక్ష్యం వహించినా పరిస్థితి వేరేగా ఉంటుందన్నారు. సత్ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకుంటే పైస్థాయి అధికారులతో మాట్లాడైనా సరే మీపై ఉన్న రౌడీషీట్‌ను తొలగించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాదూ.. కూడదని పాత పద్ధతిలోనే ఉంటే మాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

‘చంద్రదండు’ దురుసు ప్రవర్తన!
రెండు రోజుల క్రితమే బాధ్యతలు తీసుకున్న నాల్గవ పట్టణ ఎస్‌ఐ శ్రీరామ్‌ శాంతిభద్రతలను గాడిలో పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్ల కౌన్సెలింగ్‌కు శ్రీకారం చుట్టారు. మంగళవారం మొత్తం 33 మందిని స్టేషన్‌కు పలిపించారు. అయితే కౌన్సెలింగ్‌కు హాజరైన చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్‌నాయుడు ఎస్‌ఐ శ్రీరామ్‌తో దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. అయితే అదేస్థాయిలో ఎస్‌ఐ కూడా కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు తెలిసింది. దీనిపై ఎస్‌ఐను వివరణ కోరగా.. రౌడీ షీటర్లందరినీ పిలిపించామని, ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదన్నారు. ప్రకాష్‌నాయుడు అయినా మరొకరైన తన దష్టిలో సమానమేనని వివరించారు. 

మరిన్ని వార్తలు