భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా సంతకాల ఉద్యమం

19 Apr, 2017 22:15 IST|Sakshi
భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా సంతకాల ఉద్యమం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
కాకినాడ సిటీ :  భూసేకరణ చట్టం-2013  బిల్లును అసెంబ్లీలో పెట్టేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా సంతకాల ఉద్యమం చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు రావుల వెంకయ్య వెల్లడించారు. కాకినాడ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో జిల్లా పార్టీ కార్యదర్శి తాటిపాక మధు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూపీఏ-2 ప్రభుత్వం తెచ్చిన 2013 భూసేకరణ చట్టంలో రైతులకు మేలు చేసే అంశాలను తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టç సవరణ చేయడానికి ప్రయత్నించి విఫలమైందన్నారు. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా బిల్లుకు సవరణలో చేసుకోవచ్చంటూ ఆర్డినెన్స్‌ జారీ చేసిందన్నారు. ఈ బిల్లును యధాతథంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని 13 జిల్లాలలో రైతుల నుంచి సంతకాలు సేకరించి, వాటిని రాష్ట్రపతికి అందజేస్తామన్నారు. అలాగే మంత్రి వర్గ విస్తరణలో కమ్మ, రెడ్డి వర్గీయులకే అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. పోలవరం నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరిగాయని, కాగ్‌ నివేదిక ప్రభుత్వానికి మొట్టికాయ వేసినా చీమకుట్టినట్లు లేదని విమర్శించారు. పట్టిసీమ, పురుషోత్తంపట్నం ప్రాజెక్టుల వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. 
>
మరిన్ని వార్తలు