గతం కంటే ఘనం

7 Jan, 2017 02:33 IST|Sakshi
గతం కంటే ఘనం

ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు
జనగామలో రెట్టింపు స్థాయిలో నీటి మట్టాలు
యాసంగికి నీరందించేందుకు   ప్రణాళికలు  


వరంగల్‌ : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు మండలాల్లో భూగర్భ జలాలు గత ఏడాది కంటే భారీగా పెరిగాయి. గ్రామాల్లో చిన్న నీటివనరుల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడికతీతలు, మరమ్మతులు చేపట్టడంతో పాటు దేవాదులు ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులు నింపారు. అలాగే గత సెప్టెంబర్, అక్టోబర్‌లో విస్తారంగా కురి సిన వర్షాలతో నీటి మట్టాలు గణనీయంగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. చెరువుల్లో నీటి నిల్వలు సమృద్ధిగా ఉండడంతో ఆయా ప్రాంతాల్లో భూగర్భ  జలమట్టాలు భారీగా పెరిగి తక్కువ లోతులోనే నీరందుతోంది. దీంతో ఈ ఏడాది యాసంగి పంటలకు కావాల్సిన సాగునీరు సరిపడా అందే అవకాశాలున్నాయి. పునర్విభజన ప్రక్రియతో కొత్తగా ఏర్పాటైన వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో సుమారు 3 నుంచి 4 మీటర్ల మేరకు భూగర్భ జలాల మట్టం పెరగడంతో నీరు గతేడాది కంటే ఎక్కువగా లభించే అవకాశాలున్నాయి. ఆచార్య జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో గతేడాది, ఇప్పటి భూగర్భ జలాల మట్టాల నమోదును పరిశీలిస్తే కేవలం మీటరు మాత్రమే పెరిగింది.

కాగా, జనగామ జిల్లాలోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో నింపడంతో ఈ ప్రాంతంలో గణనీయంగా భూగర్భ జలమట్టాలు పెరిగాయి. ఇక్కడ గతేడాది జనవరిలో నమోదైన భూగర్భ జలాలు.. ప్రస్తుతం నమోదైన మట్టాలను పరిశీలిస్తే సుమారు 4.18 మీటర్లు పెరిగాయి. దీంతో జిల్లాలో యాసంగి పంటలను విస్తారంగా పండిం చేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు.వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో కలిపి మొత్తం 5459 చెరువులు ఉన్నాయి. చెరువుల నిల్వ నీటి సామర్థ్యం 47,177 మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్‌ (ఎంసీఎఫ్‌టీ)లు. ప్రసుత్తం 36,013 ఎంసీఎఫ్‌టీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ చెరువుల కింద 3,47,949 ఎకరాల ఆయకట్టు ఉంది.అందుబాటులో ఉన్న నీటి లభ్యతతో ఖరీఫ్, యాసంగి సీజన్లలో 1,23,033 ఎకరాల్లో సాగు నీరందించేలా చిన్న నీటిపారుదల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో యాసంగి పంట సాగుకు భరోసా కలుగనుంది.

రబీ సీజన్‌లో 25,200 ఎకరాలకు సాగునీరందించేందుకు నీటి లభ్యత అందుబాటులో ఉందని నీటిపారుదల శాఖ పేర్కొంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 2016 జనవరిలో భూగర్భ జలాలు 9.57 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుత జనవరిలో 5.66 మీటర్ల లోతునే ఉన్నాయి. అంటే గతేడాది కంటే 3.91 మీటర్ల పైనే నీటి లభ్యత ఉంది.వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 2016 జనవరిలో భూగర్భ జలాలు 10.50 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుతం 7.45 మీటర్ల లోతులో ఉన్నాయి. అంటే గతేడాది కంటే 3.05 మీటర్లు పైనే నీటి లభ్యత ఉంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 2016 జనవరిలో భూగర్భ జలాలు 9.45 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుత జనవరిలో 8.76 మీటర్ల లోతులో ఉన్నాయి.  మహబూబాబాద్‌ జిల్లాలో 2016 జనవరిలో భూగర్భ జలాలు 6.74 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుతం 6.13 మీటర్ల లోతులో ఉన్నాయి. ఇక్కడ నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. జనగామ జిల్లాలో 2016 జనవరిలో భూగర్భ జలాలు 13.84 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుత జనవరిలో 9.65 మీటర్ల లోతులోనే ఉన్నాయి. అంటే గతేడాది కంటే 4.18 మీటర్లు పైనే నీటి లభ్యత ఉంది.
 

>
మరిన్ని వార్తలు