జీరోపై వెండి విక్రయాలు

3 Mar, 2017 00:16 IST|Sakshi
జీరోపై వెండి విక్రయాలు
- నిందితుడి అరెస్టు  
- రూ.15లక్షల వెండి స్వాధీనం  
 
ఆదోని టౌన్‌ : పన్నులు చెల్లించకుండా గుట్టుగా వెండి ఆభరణాల విక్రయాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి గురువారం పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి పోలీసులు రూ. 15లక్షల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు ఆదోని టూటౌన్‌ స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. పట్టణంలోని ఖాజీపుర వీధికి చెందిన వీరేష్‌ షరాఫ్‌ బజారులో బంగారు, వెండి ఆభరణాలను తయారు చేస్తూ దుకాణాలకు విక్రయించేవాడు. ఈ వ్యవహారంలో పన్ను చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేవాడు.
 
బుధవారం ఎస్కేడీ కాలనీలోని ఏడవ రోడ్డులో నల్లని బ్యాగును భుజాన వేసుకొని అటూఇటూ తిరుగుతుండగా అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్‌ సీఐ ఘంటా సుబ్బారావు, ఎస్‌ఐ రమేష్‌బాబు సిబ్బందితో వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 33 వెండి పలకలు, 80 చిన్న, పెద్ద  వెండి కుంకుమ భరిణెలు మొత్తంగా 14,814 గ్రాముల వెండి అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. వీరేష్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. స్వాధీనం చేసుకున్న వెండిని  తదుపరి చర్యల నిమిత్తం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు చెప్పారు. 
 
>
మరిన్ని వార్తలు