సింహపురి రైలు వేళల్లో మార్పు

29 Jul, 2016 21:29 IST|Sakshi
సింహపురి రైలు వేళల్లో మార్పు
 
  • అక్టోబరు 1 నుంచి అమలు
  •  ఫలించిన ఎంపీ మేకపాటి కృషి
 
నెల్లూరు(సెంట్రల్‌): జిల్లా ప్రయాణికుల సాక్యర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధుల వినతుల మేరకు సింహపురి రైలు వేళలను మార్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గతంలో సింహపురి గూడూరులో రాత్రి 10.10 గంటలకు బయలుదేరేది. నెల్లూరుకు రాత్రి 11 గంటలకు చేరుకునేది. సికింద్రాబాదుకు మరుసటి రోజు మధ్యాహానానికి చేరుకుంటుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ప్రయాణికుల వినతుల మేరకు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రైల్వే మంత్రి, జీఎంను పలుమార్లు సింహపురి వేళలను మార్చాలని కోరుతూ వచ్చారు. ఇటీవల నెల్లూరుకు వచ్చిన రైల్వే మంత్రి సురేష్‌ప్రభు, మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు సైతం సింహపురి వేళల మార్పు విషయాన్ని ఎంపీ మరోమారు గుర్తు చేశారు. దీంతో ఎట్టకేలకు సింహపురి వేళల్లో మార్పులను తీసుకువచ్చారు. మార్చిన వేళల ప్రకారం గూడూరులో రాత్రి 6.50 గంటలకు బయలుదేరుతుంది. నెల్లూరుకు 7.18 గంటలకు, కావలికి 7.55, ఒంగోలుకు 8.40, చీరాలకు 9.30, విజయవాడకు 11.10కు చేరుకుంటుంది. విజయవాడలో 11.20 గంటలకు బయలుదేరి సికింద్రాబాదుకు మరుసటి రోజు వేకువన 5.40 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాదు– గూడూరు రైలు వేళల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. అక్టోబరు 1 నుంచి మారిన వేళలు అమలవుతాయని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.
మరిన్ని వార్తలు