సైంటిస్ట్‌లుగా సింగరేణి కార్మికుడి కుమారులు

15 Jun, 2016 09:49 IST|Sakshi

ఆదిలాబాద్: సింగరేణి కార్మికుడి పిల్లలు వ్యవసాయ శాఖలో సైంటిస్ట్‌లుగా రాణిస్తున్నారు. పేదరికాన్ని జయించి చదివే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. భూపాలపల్లి ఏరియా పరిధి కోల్‌హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో సర్ఫేస్ జనరల్ మజ్దూర్ గోకినపల్లి వెంకటేశ్వర్లు కుమారులు ఇద్దరు వ్యవసాయశాఖలో పలు పరిశోధనలు చేపట్టారు.

వెంకటేశ్వర్లు 1991లో కొత్తగూడెంలో సింగరేణిలో ఉద్యోగంలో చేరి నవంబర్ 2003లో భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 3లోకి వచ్చారు. ప్రస్తుతం కేటికే 5లో విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి తమ కోసం పడుతున్న కష్టాన్ని చూసిన ఆయన కుమారులు శేషు, సతీష్ చదువుపై ఆసక్తి పెంచుకున్నారు. పెద్దకుమారుడు శేషు ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో బీఎస్సీ(అగ్రి) చదివి, హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ పూర్తి చేశాడు. 2013లో జెనిటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌లో పీహెచ్‌డీ చేసి సీఆర్‌ఐడీఏ హైదరాబాద్‌లో ఒక ఏడాది రిసెర్చ్ చేశాడు. 2014లో మహబూబ్‌నగర్‌లోని పాలెంలో ఆర్‌ఏఆర్‌ఎస్‌లో సైంటిస్ట్‌గా చేరి, ప్రస్తుతం అక్కడే పరిశోధనలు చేస్తున్నారు. ఆయన కృషిని చూసిన సంబందిత శాఖ బంగారు పతకాన్ని ప్రకటించింది.

ఈ ఏడాది జనవరి 4న కేంద్ర అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ ఫార్మల్ వెల్ఫేర్ కార్యదర్శి సీరాజ్ హుస్సేన్(ఐఏఎస్) చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. రెండో కుమారుడు సతీష్ ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2012లో బీఎస్సీ, 2014లో ఎంఎస్సీ పూర్తి చేశారు. ప్రసుత్తం పశ్చిమ బెంగాల్‌లోని బిదాన్ చంద్ర క్రిషి విశ్వ విద్యాలయలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి ప్రజలకు సహాయ పడాలన్నదే తన  ఆశయమని తెలిపారు.

>
మరిన్ని వార్తలు