సార్‌.. రోడ్డు వేయించండి

19 Sep, 2016 23:11 IST|Sakshi
మూగవాడిలో రోడ్డు వేయాలని ఎమ్మెల్యేను కోరుతున్న విద్యార్థులు
– ఎమ్మెల్యేను కోరిన విద్యార్థులు
– ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన
రామసముద్రం: రోడ్డు సరిగా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని, రోడ్డు వేయించాలని కుదురుచీమనపల్లెలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు మదనపల్లె ఎమ్మెల్యే దేశాయ్‌ తిప్పారెడ్డిని కోరారు. ఆయన సోమవారం గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రమాన్ని మండలంలోని మూగవాడి, కుదురుచీమనపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ఆయన వద్దకు వచ్చి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. స్పందించిన ఎమ్మెల్యే రోడ్డు వేయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 
మురుగు కాలువ పూడ్చివేశారు
మూగవాడి గ్రామంలో అనేక ఏళ్లుగా ఉన్న మురుగు కాలువలను ఒక వ్యక్తి పూడ్చివేయడంతో నీరు ఇళ్ల ముందు నిలుస్తోందని మహిళలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దోమలు వృద్ధి చెంది రోగాలు ప్రబలుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో గ్రామంలో ఒకరికొకరు ఘర్షణలు పడి కేసులు పెట్టుకునే పరిస్థితి నెలకొందన్నారు. వీధుల్లో సిమెంట్‌ రోడ్లు వేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. పింఛన్లు, ఇళ్ల కోసం అనేకమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేదని విన్నవించారు. వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయిందని, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్యే పూడ్చివేసిన కాలువను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జరీనాహైదర్‌బేగం, సింగిల్‌విండో అధ్యక్షుడు కేశవరెడ్డి, సర్పంచు చౌడమ్మ, ఎంపీటీసీలు భారతమ్మ, శంకర, ఆనంద, రెడ్డెప్పనాయుడు, జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి, కో–ఆప్షన్‌ సభ్యులు మహబూబ్‌బాషా, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ సర్పంచులు ఇమామ్‌సాబ్, లింగారెడ్డి, బాస్కర్‌గౌడు తదితరులు పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు