మద్యం కోసం చెల్లిని చావబాదిన అన్నలు

1 Sep, 2016 21:21 IST|Sakshi

అమీర్ పేట: చెల్లిని బడిలో చేర్చించి విద్య నేర్పించాల్సిన అన్నలు ఆమెను ఇళ్లల్లో పని మనిషిగా చేర్చారు... మద్యం కోసం డబ్బులు కావాలని వేధించి చావబాదారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ నవీన్‌ కథనం ప్రకారం... బల్కంపేట బీకేగూడ మజీద్‌ బస్తీకి చెందిన యూసుఫ్‌మియా కురేషికి ఆరుగురు సంతానం.  మటన్‌ కొట్టులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

మూడో కూతురు సబా (15) ఉర్దూ మీడియంలో నాలుగో తరగతి చదువుతున్న సమయంలో ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బడి మాన్పించారు.  తెలిసిన ఇళ్లలో పాచిపని చేస్తూ సబా తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటోంది. అన్నలు ముగ్గురూ జులాయిగా తిరుగుతూ మద్యానికి అలవాటు పడ్డారు. మద్యం తాగి ఇంటికి వచ్చి తరుచూ తల్లిదండ్రులతో గొడవపడేవారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు మద్యానికి డబ్బులు కావాలని కొడుకులు తండ్రితో గొడవకు దిగగా.. ఆయన తన వద్ద డబ్బులు లేవని చెప్పారు. ఎలాగైనా మాకు డబ్బు ఇవ్వాల్సిందేనని చెల్లి సబాను అన్నలు పట్టుబట్టారు.

ఇచ్చేందుకు నిరాకరించిన చెల్లెలుపై చెయ్యి చేసుకున్నారు. దీంతో తీవ్రమనస్తాపం చెందిన సబా గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి సాయంత్రం 6.30కి గదిలోకి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందికి దించి ఉస్మానియాకు తరలించగా.. అప్పటికే సబా మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. ఆసుపత్రి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపారు. సోదరుల వేధింపుల కారణంగానే సబా ఆత్మహత్య చేసుకుందని నిర్థారించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సోదరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు