శిశువు మృతి వివాదాస్పదం

8 Dec, 2016 23:36 IST|Sakshi
శిశువు మృతి వివాదాస్పదం
భీమవరం టౌన్‌: భీమవరం ఏరియా ఆసుపత్రిలో మగశిశువు మృతి వివాదాస్పదంగా మారింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లికి గర్భశోకం కలిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే.. వైద్యలోపం లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. 1వ వార్డు మెంటేవారి తోటకు చెందిన షేక్‌ అమ్మాజీ అనే గర్భిణి తొలికాన్పుకోసం ఏరియా ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. గురువారం నొప్పులు రావడంతో ఆసుపత్రి సిబ్బంది ఆమెను ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకువెళ్లగా ప్రసవించింది. అయితే శిశువు మృతి చెందింది. కడుపులోనే శిశువు చనిపోయిందని ఆపరేషన్‌ థియేటర్‌లోంచి  దుర్వాసన తట్టుకోలేక నర్సులు బయటకు పరిగెత్తుకు వచ్చేశారని అమ్మాజీ వదిన ఫాతిమాబీబీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారం రోజుల క్రితం స్కానింగ్‌ చేయించామని డాక్టర్లు రిపోర్ట్‌ చూసి శిశువు ఆర్యోగంగా ఉందని ప్రసవానికి ఇంకా కొన్ని రోజులు సమయం పడుతుందని చెప్పారన్నారు. డాక్టర్లు సూచించినట్టు మందులు వాడుతున్నామన్నారు. ఇప్పుడు శిశువు చనిపోవడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. కుటుంబ సభ్యులు ఆందోళన చేసేందుకు సిద్ధపడ్డారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్‌ ఎస్సై కె.సుధాకరరెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మొగలి వీరాస్వామి అమ్మాజీ, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పరిస్థితిని వివరించి వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని చెప్పారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ షేక్‌ అమ్మాజీ ప్రసవించేందుకు ఈనెల 14వ తేది వరకూ సమయం ఉందని అయితే ఆమె బలహీనంగా ఉండటంతో ముందుగానే ఆసుపత్రిలో చేర్చారన్నారు. ఆమెకు రోజూ వైద్య పరీక్షలు చేస్తున్నామన్నారు. ఆకస్మికంగా నొప్పులు వచ్చాయని ప్రసవానికి తీసుకువెళ్లగా శిశువు ఇన్‌ఫెక్షన్‌తో పుడుతూనే చనిపోయాడన్నారు. ఆసుపత్రి రెగ్యులర్‌ డాక్టర్‌ నవీన సెలవులో మరో డాక్టర్‌ ప్రత్యూష డెలివరీ కేసుకు హాజరయ్యారన్నారు. ఎక్కడా వైద్యలోపం జరగలేదని వివరించారు. కౌన్సిలర్‌ పంతం సతీష్‌ బాధితులను పరామర్శించారు. 
 
మరిన్ని వార్తలు