పరిస్థితి అదుపులో ఉంది

24 Sep, 2016 18:03 IST|Sakshi
అన్నాసాగర్‌ చెరువు వద్ద అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌
  • కంట్రోల్‌ రూంకు 21 విజ్ఞప్తులు
  • మూడు చోట్ల రోడ్ల దిగ్బంధం, సహాయక చర్యలు
  • సింగూరు నుంచి 90 వేల క్యూసెక్కుల నీరు విడుదల
  • అందోలు, అన్నాసాగర్‌ చెరువుల పరిశీలించిన కలెక్టర్‌
  • జోగిపేట: జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నా పరిస్థితులు అదుపులో  ఉన్నాయని కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ అన్నారు. శనివారం అందోలు, అన్నాసాగర్‌ చెరువులను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌  మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంనకు 21 విజ్ఞప్తులు వచ్చాయన్నారు. మూడు చోట్ల రోడ్లు దిగ్బంధం అయ్యాయని, సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

    సింగూరు ప్రాజెక్టులోకి 10 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉండగా 90వేల క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లో ఉందన్నారు. మంజీరలోని అన్ని గేట్లను ఎత్తివేసారని, సింగూరులో 7 గేట్లు వదిలేసినట్లు  చెప్పారు. చెరువులు పొంగి పొర్లుతున్న చోట కాపాలాగా రెవెన్యూ సిబ్బందితో పాటు పోలీసులు కూడా ఉండాలని ఆదేశించారు. మంజీర పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, నది వైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని తహసీలుదారును ఆదేశించారు.

    అన్నాసాగర్‌ చెరువు పొంగడం వల్ల ఇళ్లకు ఏమైనా నష్టం ఉందా అని తహసీల్‌దారును ప్రశ్నించారు. అందోలు తహసీల్‌దారు నాగేశ్వరరావు, ఆర్‌ఐ సతీష్‌, వీఆర్‌ఓ రాంచంద్రారావుతో పాటు పలువురు కలెక్టర్‌ వెంట ఉన్నారు. రాయికోడ్‌లో బ్రిడ్జిపై ఉన్న లారీని చూసి ఈ ప్రాంతానికి వెళ్లే రహదారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు