పులకించిన ప్రశాంతి నిలయం

25 Feb, 2017 00:11 IST|Sakshi
పులకించిన ప్రశాంతి నిలయం

ఘనంగా శివరాత్రి పర్వదిన వేడుకలు
భక్తి శ్రద్ధలతో మహారుద్రాభిషేక ఘట్టం

పుట్టపర్తి టౌన్‌ : సత్యసాయి సన్నిధిలో శివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాది భక్తులు సత్యసాయి మహాసమాధి చెంత శివనామాన్ని స్మరిస్తూ సాయీశ్వర లింగానికి అభిషేకం చేస్తూ పరవశించిపోయారు. శుక్రవారం ఉదయం వేడుకలు వేదపఠనం, సత్యసాయి యూనివర్శిటీ విద్యార్థులు నాదస్వరం, పంచవాయిద్యాలతో ప్రారంభమయ్యాయి. సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ సభ్యుడు ఆర్‌జే రత్నాకర్‌రాజు, ఇతర ట్రస్ట్‌ సభ్యులతో కలసి సత్యసాయి పరమభక్తుడు అజిత్‌పోపట్‌ రచించిన ‘ది డివైన్‌ పప్పెటీర్‌’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

సత్యసాయి బాబా  2001 నుంచి 2010 మధ్యకాలంలో భక్తులనుద్దేశించి ఇచ్చిన 65 ప్రసంగాల సమాహారాన్ని ఇందులో పొందుపరిచారు. అనంతరం సత్యసాయి మహాసమాధి చెంత వేదపండితులు మహారుద్రాభిషేకం నిర్వహించారు. సాయికుల్వంత్‌ సభా మందిరంలోని భజన మందిరంలో పండితుల వేదపఠనం నడుమ గణపతిపూజ, కుంకుమపూజ, కళశపూజ తదితర పూజాక్రతువులు నిర్వహించారు. మహారుద్రాభిషేకం ముగిసిన అనంతరం సాయీశ్వరున్ని కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. వేడుకల్లో తెలంగాణ ఐజీ చారుసిన్హా, సత్యసాయి ట్రస్ట్‌ సభ్యులు విజయభాస్కర్, ప్రసాద్‌రావు, నాగానంద, సత్యసాయి సేవా సంస్థల దేశీయ అధ్యక్షుడు నిమిష్‌పాండ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు