టిప్పర్ రూపంలో మీదపడ్డ మృత్యువు

15 May, 2016 01:10 IST|Sakshi
టిప్పర్ రూపంలో మీదపడ్డ మృత్యువు

- ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- ఆటోపై టిప్పర్ బోల్తా: 16 మంది దుర్మరణం
- మృతుల్లో ఏడుగురు చిన్నారులు.. ఇటుక బట్టీల్లో కూలీలుగా జీవనం
- భైంసా-బాసర ప్రధాన రహదారిపై దేగాం వద్ద అర్ధరాత్రి ఘటన

 
భైంసా:
ఆదిలాబాద్ జిల్లా భైంసా-బాసర ప్రధాన రహదారిపై దేగాం గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 16 మంది మృతిచెందారు. సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మకు మొక్కులు తీర్చుకునేందుకు మహారాష్ట్ర బల్లాడ్ గ్రామానికి చెందిన 18 మంది ఇటుక కార్మికులు ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

భైంసా వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న కంకర టిప్పర్ ఢీకొట్టి ఆటోపై పడింది. దాంతో ఆటో నుజ్జునుజ్జై అందులో ప్రయాణిస్తున్న 16 మంది మృతి చెందారు. మృతులు నిజామాబాద్ జిల్లా నవీపేట్లో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కూలీలుగా గుర్తించారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, ఐదుగురు మహిళలతో సహా నలుగురు పురుషులు ఉన్నారు. ఆటో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. అధికారులు క్రేన్ తో టిప్పర్ను తొలగించారు. క్షతగాత్రులను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. బలిచ్చేందుకు తీసుకెళ్తున్న మేక ప్రమాదం నుంచి బయటపడింది.

మృతులు వివరాలు: గణపతి, రత్నాభాయి, నారుంగ్, వందనభాయి, రాజేష్, మహేంద్ర, దీప, సాయి ప్రసాద్, సుశీల భాయి, అర్జున్, ప్రియాంక, ప్రేమ్, చాకులి, శ్యామలాభాయి, సంపంగి భాయి, అర్చన. 
 

 

మరిన్ని వార్తలు