తప్పిన సెంటిమెంట్‌ ముప్పు

27 Dec, 2016 22:52 IST|Sakshi
 • 1956 నుంచి ప్రతీ పదేళ్లకు తుపాన్ల గండం
 • అంతులేని ఆస్తి నష్టం 
 • భయపడ్డ జిల్లా ప్రజలు
 • ఎలాంటి ఇక్కట్లు లేకపోవడంపై హర్షం
 •  
  అమలాపురం :
  సంవత్సరం చివరిలో ‘ఆరు’ సంఖ్య వస్తే జిల్లా వాసులు ఏదో ఒక ఉపద్రవాన్ని ఎదుర్కొనడం సెంటిమెంట్‌గా మారింది. 1956 నుంచి 2006 వరకు ప్రతీ పదేళ్లకు ఒకసారి పెను తుపాను.. మరోసారి గోదావరికి భారీ వరదలు ముంచెత్తి జిల్లాను అతలాకుతలం చేశాయి. పెద్ద సంఖ్యలో ప్రాణ, కోట్ల రూపాయల ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ఈ ఏడాది 2016లో కూడా చివరన ఆరు ఉండడంతో విపత్తు తప్పదని జిల్లా వాసులు, మరీ ముఖ్యంగా కోనసీమ వాసులు ఏడాదంతా ఆందోళనతోనే గడిపారు. ఇందుకు విరుద్ధంగా ఈ ఏడాది వరదలు, తుపాను వంటి విపత్తులు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. 1956లో తుపాను సంభవించి కోనసీమలో బీభత్సం సృష్టించింది. ప్రజలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 1966లో భారీ వరదలు ముంచెత్తాయి. కాట¯ŒS కాలంలో నిర్మించి ఆనకట్టకే గండి పడిందంటే వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 1976 దివిసీమకు ఉప్పెన తాకిన సమయంలోనే జిల్లాను తుపాను గడగడలాడించి పెద్ద నష్టాన్నే మిగిల్చింది. ఇవన్నీ ఒక ఎత్తయితే 1986 గోదావరికి భారీ వరదలు సంభవించి ఉభయ గోదావరి జిల్లాలను ముంచెత్తాయి. ఆ ఏడాది ఆగస్టులో గోదావరికి మొదటసారి వచ్చిన వరదతో రెండు జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. ధవళేశ్వరం బ్యారేజ్‌ నుంచి రికార్డు స్థాయిలో 35 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. అప్పుడు.. ఇప్పుడు అదే అతి పెద్ద వరద. దీని ఉధృతికి రెండు జిల్లాలో పలుచోట్ల గండ్లు పడ్డాయి. మొత్తం డెల్టా ఏటిగట్లు నాశనమయ్యాయి. జిల్లాలో పి.గన్నవరం మండలం నాగుల్లంక, గంటి గ్రామాల వద్ద పెద్ద గండ్లు పడ్డాయి. అంతులేని ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం చోటుచేసుకుంది. గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయాయి. 
  1996లో తుపాను మిగిల్చిన విషాదం అంతాఇంతా కాదు. పెనుగాలులు 175 కిమీల వేగంతో వీచాయి. ఈ తుపానుకు కోనసీమలో సుమారు 552 మంది మృత్యువాత పడ్డారు. పెనుగాలులకు 32 లక్షల కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. 55 లక్షల చెట్ల మొవ్వులు ఒడితిరిగి పోయాయి. తుపాను నుంచి కొబ్బరి కోలుకుని సాధారణ దిగుబడి ఇవ్వడానికి మూడేళ్ల సమయం పట్టింది. ఐ.పోలవరం మండలం భైరవపాలెం గ్రామం దాదాపు తుడుచుపెట్టుకుపోయింది.  ఆ తుపాను గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో 2006 వచ్చిన వరదలు కోనసీమకు అంతులేని నష్టాన్ని మిగిల్చాయి. సుమారు 28 లక్షల క్యూసెక్కుల నీరు వదలడంతో అయినవిల్లి మండలం శానపల్లిలంక, పి.గన్నవరం మండలం మొండెపులంక వద్ద ఏటిగట్లకు గండ్లు పడి ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకున్నాయి. సంవతర్సం చివర ‘ఆరు’ వచ్చినప్పుడల్లా జరుగుతున్న విపత్తులను చూసి ఈ ఏడాది కూడా విపత్తు తప్పదని జిల్లా వాసులు ఏడాదంతా ఆందోళనతోనే గడిపారు.  ఈ ఏడాది ఆగస్టులో వరద రావడం, నవంబరు, డిసెంబర్లలో తుపాను హెచ్చరికలు తీవ్ర కలవరాన్ని రేపాయి. వాటి ముప్పుతప్పడంతో పాటు మరో నాలుగు రోజుల్లో ఏడాది పూర్తికావస్తుండడంతో ఆనవాయితీ తప్పిందని ఉపరిపీల్చుకుంటున్నారు.  
   
మరిన్ని వార్తలు