లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ

19 Jul, 2017 23:29 IST|Sakshi
లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ
-కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా
కాకినాడ సిటీ :    ఉపాధి కల్పనలో భాగంగా జిల్లాలో 2017–18 సంవత్సరంలో లక్ష మంది యువతకు వివిధ శాఖల ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నామని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు. జిల్లాలో డీఆర్‌డీఏ, వికాస, మెప్మా, సెట్రాజ్, ఆత్మా, ఎస్సీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్‌ల ఆధ్వర్యంలో నిర్వహించే నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై బుధవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. యువత వివిధ సంస్థలలో ఉపాధి పొందేలా, స్వయం ఉపాధి చేపట్టేలా వారికి శిక్షణ ఇవ్వాలని కలెక్టర్‌ సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమం అమలుకు జిల్లా క్యాలెండర్‌ రూపొందించాలన్నారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసే పరిశ్రమలలో స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు చేపట్టాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్‌ను ఆదేశించారు. పరిశ్రమలకు ఏరకమైన ఉద్యోగులు కావాలో యువతకు ఆ శిక్షణ ఇచ్చి, ఆయా పరిశ్రమలలో నియమించేలా అనుసంధానం చేయాలన్నారు. ఏ నెల ఎక్కడ ఏ రకమైన శిక్షణ యువత పొందుతున్నారో ఆ వివరాలను జిల్లా నైపుణ్యాల రిజిస్టర్‌ తయారు చేయాలన్నారు. జిల్లాలో వివిధ సంస్థలు రకరకాల శిక్షణ ఇస్తున్నాయని, వాటన్నింటినీ సమన్వయం చేయాలని సూచించారు.  ప్రభుత్వ, ప్రభుత్వేతర శిక్షణా సంస్థలు సంయుక్తంగా పనిచేయడానికి డీఆర్‌డీఏ, వికాస ద్వారా సమన్వయం చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న వనరులకు, ఆయా పరిశ్రమల అవసరాలకనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించి, ఈ శిక్షణతో  ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు. డీఆర్‌ఓ ఎం.జితేంద్ర, డీఐసీ జిల్లా మేనేజర్‌ ఏవీ పటేల్, డీఆర్‌డీఏ పీడీ ఎస్‌.మల్లిబాబు, వికాస పీడీ వీఎన్‌ రావు, మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.అలీంబాషా, మెప్మా పీడీ రత్నంబాబు, బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఎం.జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ డేవిడ్‌రాజు, ఆత్మా పీడీ పి.పద్మజ, సెట్రాజ్‌ సీఈఓ ఎం.శ్రీనివాసరావు, వ్యవసాయ, ఉద్యానవన పరిశ్రమల శాఖల అధికారులు, వివిధ శిక్షణా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు