కొంత మోదం.. మరికొంత ఖేదం.!

20 Jun, 2017 22:26 IST|Sakshi
కొంత మోదం.. మరికొంత ఖేదం.!

– ఎస్కేయూ వీసీ ఆచార్య కె.రాజగోపాల్‌ పదవీ కాలానికి రేపటితో రెండేళ్లు
– భర్తీ చేయని టీచర్‌ పోస్టులు
– ప్రైవేట్‌ సెక్యూరిటీ నియామకంతో నిధులు వృథా
– స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుతో ఉద్యోగాల కల్పన

శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కేయూ) వైస్‌ చాన్స్‌లర్‌గా ఆచార్య కె. రాజగోపాల్‌ బాధ్యతలు చేపట్టి గురువారంతో రెండు సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ రెండేళ్లలో కంపెనీలు ఆశించిన రీతిలో అభ్యర్థుల్లో నైపుణ్యాభివృద్ధి కల్పనకు దోహదపడేలా ఆయన పలు చర్యలు చేపట్టారు. ఆయన చేపట్టిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా రాబోవు రెండేళ్లలో ఇదే ఒరవడి కొనసాగితే అద్భుత ఫలితాలు ఉంటాయనడంలో సందేహం లేదు.  సాధారణ డిగ్రీతోనే టీసీఎస్‌ కంపెనీలో 380 మంది ఉద్యోగాలు దక్కించుకున్నారంటే ఈ సెంటర్‌ పనితీరు ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రెండేళ్లలో ఎస్కేయూ అభివృద్ధి పథంలో కొనసాగడంతో పాటు మరికొంత వెనుకబాటు కూడా ఉండడం గమనార్హం.
- ఎస్కేయూ

మౌలిక వసతుల కల్పనకు నిధుల వెల్లువ
– రాష్ట్రీయ ఉచ్ఛారతా శిక్షా అభియాన్‌ పథకం (రూసా) ద్వారా కేంద్ర ప్రభుత్వం  ప్రత్యేకంగా రూ.20 కోట్ల మేర నిధులు అందించింది. దీంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు  
– పాలక భవనంలో వీసీ, రెక్టార్‌ , రిజిస్ట్రార్ల ఛాంబర్లు ఆధునీకరించారు
– ఇంజినీరింగ్‌ విభాగంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు రెండు ప్రత్యేక హాస్టళ్ల నిర్మాణానికి అనుమతి
– అన్ని హాస్టళ్లలో మరుగుదొడ్ల ఆధునికీకరణ
– ప్రత్యేకంగా రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు డైరెక్టర్‌ నియామకం.  రెండు దఫాలుగా రీసెట్‌ నిర్వహణ,  తాజాగా ఆన్‌లైన్‌ విధానం ద్వారా రీసెట్‌ విజయవంతం
– జంబ్లింగ్‌ విధానంలో పరీక్షలు నిర్వహించడంతో మాస్‌కాపీయింగ్‌కు అడ్డుకట్ట. నూతనంగా ప్రశ్నపత్రాలను ఆన్‌లైన్‌ విధానం ద్వారా పరీక్ష కేంద్రాలకు పంపే ప్రక్రియ విజయవంతం

ఉద్యోగాల కల్పన
– స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించి 270 మంది వివిధ కంపెనీల్లో, టీసీఎస్‌లో 380 మందికి ఉద్యోగాలు దక్కేలా చేశారు. ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్స్‌ స్కిల్స్, డిజటల్‌ డిజైన్, సీ లాంగ్వేజ్, సాప్ట్‌వేర్‌ టెస్టింగ్, వంటి  కోర్సులపై ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు
– గత రెండేళ్లలో 640 మంది విద్యార్థులకు రైల్వే, బ్యాంకింగ్‌ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇప్పించారు
– రెండు దఫాలుగా ఉచితంగా స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ తరగతులు
– రెండు దశాబ్దాలుగా నోటిఫికేషన్‌కు నోచుకోక పోయిన నాన్‌టీచింగ్‌ పర్మినెంట్‌ బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ ప్రక్రియ చేపట్టారు. మొత్తం 72 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు

విభజించినా.. ఫలితం శూన్యం
ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అడ్‌హాక్‌ లెక్చరర్లను నియామకాన్ని పారదర్శకంగా చేపట్టారు. ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో ఫార్మసీ కళాశాలకు అనుమతి పొందారు. లా కళాశాలకు బార్‌ కౌన్సిల్‌ అనుమతి మంజూరుకు చొరవ చూపారు. క్యాంపస్‌లో ఆర్ట్స్, సైన్స్‌ కళాశాలను వేరు చేసి ఇద్దరేసి ప్రిన్సిపళ్లు, వైస్‌ ప్రిన్సిపళ్ల నియామకం చేసినా... పాలనా పరంగా జాప్యం చోటు చేసుకుంటోంది. నూతనంగా హాస్టల్‌ మేనేజర్స్‌ను నియమించినప్పటికీ... నాణ్యమైన ఆహారం అందించడంలో విఫలమయ్యారు. దీంతో తిరిగి హాస్టల్‌ మేనేజర్స్‌ను రద్దు చేసి.. యథాతథంగా వార్డెన్స్‌ను నియమించారు.

ఆర్థిక వనరులు వృథా
ఆర్థిక  సంస్కరణలతో వర్సిటీ అభివృద్ధి గాడిలో పడింది. వర్సిటీ ప్రతిష్ట రాష్ట్ర, జాతీయ స్థాయిలో పెరిగింది. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ ర్యాంకింగ్‌ ప్రేమ్‌ వర్క్‌)లో తొలి సారిగా 100 లోపు ర్యాంకు వచ్చింది. అయితే కొన్ని విధానాల అమలులో ఆర్థిక వనరులు వృథా అయ్యాయన్న ఆరోపణలూ లేకపోలేదు. వర్సిటీలోని హాస్టళ్లు, ఇతర కార్యాలయాల్లో 70 మంది ప్రైవేటు భద్రతా సిబ్బందిని నియమించారు. దీంతో ఏటా రూ.84 లక్షలు ఖర్చు అవుతోంది. వాస్తవానికి ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి చెల్లించే మొత్తానికి, ఉద్యోగులకు ఏజెన్సీ వారు చెల్లించే జీతాలకు   భారీ వ్యత్యాసం ఉన్నా చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. టెండర్ల ద్వారా ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి కట్టబెట్టకపోవడం వివాదాలకు దారితీసింది. ఔట్‌ సోర్సింగ్‌ నిర్వాహకుడు ఉద్యోగుల పీఎఫ్‌ మొత్తాన్ని కాజేసి పత్తా లేకుండా పోయాడు. ఏజెన్సీ నిర్వాహకుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

గతేడాది న్యాక్‌ పర్యటన నిమిత్తం లక్షలాది రూపాయలు అభివృద్ధి నిధులు మంజూరు చేశారు. తొందరగా పూర్తి చేయాలనే ఆత్రుతతో నామినేషన్‌ పద్దతి మీద పనులు కట్టబెట్టారు. ఇవి కూడా వివాదస్పదమయ్యాయి. యూజీ పరీక్షల విభాగం పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందనేది నిష్ఠూర సత్యం. రెండేళ్ల క్రితం పరీక్షలకు గైర్హాజరైన వారు సైతం ఉత్తీర్ణులయ్యారు. 2016–17 క్యాంపస్‌లో అన్ని విభాగాలకు  బయోమెట్రిక్‌ విధానం అమలు చేసినప్పటికీ.. ప్రస్తుతం ఏ ఒక్క పరికరం కూడా పనిచేయలేదు. దీంతో రూ.3.19 లక్షల నిధులు వృథా అయ్యాయి. 2016–17 విద్యాసంవత్సరంలో దూరవిద్యకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ఫలితంగా కోట్లాది రూపాయల ఆదాయాన్ని వర్సిటీ కోల్పోయింది.

విదేశీ వర్సిటీలతో అవగాహన ఒప్పందాలు:
ఎస్కేయూకు వీసీగా ఉన్న  సమయంలోనే ఎస్వీ, యోగివేమన వర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీగా కె.రాజగోపాల్‌ను నియమించారు. తాజాగా జేఎన్‌టీయూ(ఎ)కు ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. ఎస్కేయూపై పూర్తి సమయాన్ని కేటాయించకపోడంతో రెండో ఏడాదిలో వర్సిటీ పురోగతి ఆశాజనకంగా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. 30 దేశీయ, విదేశీ వర్సిటీ, పారిశ్రామిక సంస్థలతో ఉపాధి అవకాశాల మెరుగు, నైపుణ్యాల పెంపుదలకు అవగాహన ఒప్పందాలు జరిగాయి. అయితే ఇవి అమలు జరిగిన దాఖలాలు లేవు. అవగాహన ఒప్పందాలు జరగడమే తప్ప వీటి వల్ల విద్యార్థులకు లబ్ధి చేకూరలేదనే విమర్శలూ ఉన్నాయి.

మరిన్ని వార్తలు