ఆ రూ.500 కోట్లూ మాకిచ్చేయండి

10 Jun, 2016 01:44 IST|Sakshi
ఆ రూ.500 కోట్లూ మాకిచ్చేయండి

ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు సూచన
సాక్షి, విజయవాడ బ్యూరో: తాను సృజనాత్మకంగా, కొత్తగా పనిచేస్తున్నానని.. బ్యాంకర్లు కూడా అలాగే పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. పాత విధానాలను వదిలిపెట్టి, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన 194వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో సీఎం మాట్లాడారు. రెండంకెల వృద్ధిరేటు లక్ష్యంగా తాము పని చేస్తున్నామని.. అందుకనుగుణంగా బ్యాంకులు ప్రాధాన్యత రంగాలకు రుణాలివ్వాలని కోరారు. రుణ ప్రణాళికలకు ఆమోదముద్ర వేయించుకోవడం ప్రధానం కాదని..

అమలులో కూడా అదే వేగం, ఉత్సాహాన్ని చూపించాలని అన్నారు.  అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ శాఖలకు లక్ష్యాలు నిర్దేశించామని, బ్యాంకర్లు వారిని సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఆర్‌బీఐ కూడా సృజనాత్మకంగా పనిచేయాల్సి ఉందన్నారు. స్మార్ట్ గ్రామాల ప్రాజెక్టు రిపోర్టులకు నాబార్డు రూ.500 కోట్లు ఖర్చు చేస్తోందని, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ఈ మొత్తాన్ని నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికే ఇస్తే మిగిలిన పథకాలతో కలిపి వినియోగిస్తామని, తద్వారా మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు.
 
రాష్ట్ర రుణ ప్రణాళిక విడుదల
ప్రతి గ్రామంలో వ్యక్తిగత మౌలిక వసతులు, సామాజిక మౌలిక వసతులను కల్పించేం దుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలే ఇకపై బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా పనిచేస్తారని, ఇందుకు బ్యాంకులు సహకరించాలని కోరారు. జల సంరక్షణ ద్వారా వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చే పద్ధతులను అమలు చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రుణ ప్రణాళికను చంద్రబాబు విడుదల చేశారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో పలు రంగాలకు రూ.1,65,538 కోట్ల రుణాలు మంజూరు చేయాలని ఎస్‌ఎల్‌బీసీ ప్రతిపాదించింది. ఈ సమావేశంలో బ్యాంకర్ల సమితి కన్వీనర్, ఆంధ్రాబ్యాంకు జీఎం దుర్గాప్రసాద్, ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్, ఆంధ్రా బ్యాంకు ఎండీ, సీఈఓ సురేష్ ఎన్.పటేల్, నాబార్డు జీఎం చంద్రశేఖర్, ఆర్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్.చెల్లపండి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు