మో'డల్‌' వసతి!

18 Jul, 2017 23:03 IST|Sakshi
మో'డల్‌' వసతి!

నాలుగేళ్లుగా ఊరిస్తున్న హాస్టళ్లు
- ప్రారంభోత్సవం 36సార్లు వాయిదా
- ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే మూడు తేదీల ప్రకటన
- కనీసం సౌకర్యాలు కల్పించడంలోనూ మీనమేషాలు
- పోస్టుల భర్తీలోనూ ఇదే పరిస్థితి
- ఏటా విద్యార్థినులకు ఇక్కట్లే..


జిల్లాలో మోడల్‌ స్కూళ్లు : 25
విద్యార్థుల సంఖ్య : 10,902
తొలివిడత ప్రారంభమయ్యే హాస్టళ్లు : 19
ఇప్పటి వరకు ప్రారంభమైన హాస్టళ్లు : 0


అనంతపురం ఎడ్యుకేషన్‌ : మోడల్‌ స్కూళ్లలో విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హాస్టళ్లను ప్రారంభించే విషయంలో అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న ప్రభుత్వం ఇప్పటికి 36 సార్లు వాయిదా వేసింది. 2013–14 విద్యా సంవత్సరంలో మోడల్‌ స్కూళ్లు ప్రారంభమైనా.. హాస్టల్‌ విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రతిసారి తేదీ ప్రకటించడం.. ఆ తర్వాత వాయిదా వేయడం పరిపాటిగా మారింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన 37 రోజుల్లో మూడుసార్లు తేదీలు ప్రకటించి వాయిదా వేశారు. తాజాగా ఆగస్టులో ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నా.. ఇప్పటి వరకు ఆ పరిస్థితి లేకపోవడం గమనార్హం.

ప్రతిభ ఉండి సరైన ప్రోత్సహం లేక చదువుకు దూరమవుతున్న విద్యార్థుల కోసం  ఆంగ్ల మాధ్యమంతో కూడిన మోడల్‌ స్కూళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 2012–13 విద్యా సంవత్సరంలో జిల్లాలోని 63 మండలాల్లో స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పరిస్థితులు అనుకూలించక 2013–14 సంవత్సరానికి వాయిదా వేశారు. అది కూడా తొలివిడత కేవలం 25 మండలాల్లో స్కూళ్లు ప్రారంభించారు. తక్కిన మండలాల్లో ఇప్పటికీ స్కూళ్లను కూడా ఏర్పాటు చేయలేకపోయారు. ప్రారంభంలో వసతితో కూడిన చదువు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. తీరా ప్రారంభ సమయానికి వసతి విషయంలో చేతులెత్తేసింది. జిల్లాలో మొత్తం 25 మోడల్‌ స్కూళ్లు ఉండగా.. వీటిలో 6–10 తరగతుల విద్యార్థులు 8623 మంది, ఇంటర్‌ విద్యార్థులు 2279 మంది చదువుతున్నారు.

అడుగడుగునా నిర్లక్ష్యమే..
ప్రారంభ సంవత్సరంలో హాస్టల్‌ సదుపాయం ఉంటుందని చెప్పడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీ పడి దరఖాస్తు చేసుకున్నారు. కానీ వివిధ కారణాలతో హాస్టల్‌ వసతి కల్పించలేకపోయారు. తీరా చేరిన తర్వాత విద్యార్థులకు సినిమా కష్టాలు మొదలయ్యాయి.  మండల పరిధిలో దూరప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ స్కూళ్లలో చదువుకోలేక, వదిలిపెట్టలేక ఇబ్బందులు పడ్డారు. చాలాచోట్ల తల్లిదండ్రులు అద్దె ఆటోలను మాట్లాడి రోజూ పిల్లలను బడికి పంపుతున్నారు.

ఊరిస్తున్న అధికారులు
అన్ని తరగతులకు హాస్టల్‌ వసతి ఉంటుందని చెప్పిన అధికారులు తర్వాత బాలికలకు మాత్రమే అన్నారు. జిల్లాలో 25 స్కూళ్లు ఉండగా.. 19 స్కూళ్లలో ప్రారంభించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నారు. అది కూడా 9 నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న ఆడ పిల్లలకు మాత్రమే కల్పిస్తామని చెప్పారు. ప్రతి హాస్టల్‌లోనూ 9 నుంచి ఇంటర్‌ బాలికలకు వంద సీట్లు కేటాయిస్తామన్నారు. ఈ లెక్కన మొత్తం 1900 మంది బాలికలకు వసతి కల్పించాల్సి ఉంది. ఒక్కో స్కూల్‌కు రూ.61 వేలతో వంటపాత్రలు కొనుగోలు చేశారు. గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేశారు. ప్రభుత్వం సరఫరా చేసే చౌక బియ్యం కోసం విద్యాశాఖ పౌరసరఫరాల శాఖకు లేఖ రాసింది. ఆ శాఖ నుంచి ఇంకా అనుమతులు రాలేదు. అలాగే మ్యాట్రిన్, చౌకీదారు, హెడ్, హెల్పర్‌ కుకింగ్‌ పోస్టులు భర్తీ చేయాలి. ఇప్పటిదాకా వీటి భర్తీ ప్రక్రియ జరగలేదు. పోనీ ఎప్పటిలోగా ప్రారంభిస్తారనే సమాచారం అ«ధికారుల వద్దే లేకపోవడం గమనార్హం.

తొలివిడతలో ప్రారంభం కానున్న హాస్టళ్లు
అగళి, అమడగూరు, అమరాపురం, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, గార్లదిన్నె, గుత్తి, కళ్యాణదుర్గం, కనగానపల్లి, కణేకల్, నల్లచెరువు,  పుట్లూరు, పుట్టపర్తి, రామగిరి, రాప్తాడు, రాయదుర్గం,  విడపనకల్లు, యాడికి, యల్లనూరు.

త్వరలో ప్రారంభిస్తాం
వివిధ కారణాలతో మోడల్‌ స్కూళ్లలో హాస్టళ్ల వసతి ఏర్పాటు ఆలస్యమైంది. దాదాపు పనులన్నీ పూర్తయ్యాయి. బియ్యానికి కూడా అనుమతులు వచ్చాయి. మ్యాట్రిన్, చౌకీదారు, కుకింగ్‌ పోస్టుల భర్తీకి ఏజెన్సీని ఫైనల్‌ చేస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తికాగానే హాస్టళ్లు ప్రారంభిస్తాం. తొలివిడతగా 9 నుంచి ఇంటర్‌ వరకు బాలికలకు మాత్రమే అవకాశం ఉంటుంది.
– పగడాల లక్ష్మీనారాయణ, డీఈఓ

మరిన్ని వార్తలు