తూములో చిక్కుకుని గ్రామసేవకుడి మృతి

29 Jul, 2016 22:54 IST|Sakshi
తూములో చిక్కుకుని గ్రామసేవకుడి మృతి
 
బోధన్‌ : బోధన్‌ మండలం సాలూర శివారులోని గజ్‌గన్‌కుంట (చెరువు) తూము షెట్టర్లు బిగించే క్రమంలో తూములో చిక్కుకుపోయి గ్రామసేవకుడిగా విధులు నిర్వర్తిస్తున్న దార్శె నాగయ్య (28)మృతి చెందాడు. సాలూరకు చెందిన గ్రామసేవకురాలు దార్శె భూమవ్వ కుమారుడు నాగయ్య, తల్లి అనారోగ్య కారణంగా కొంత కాలం నుంచి గ్రామసేవకుడిగా విధులు నిర్వరిస్తున్నాడు. గజ్‌గన్‌కుంటలో వర్షం నీరు చేరడంతో నీళ్లతో నిండిపోయింది. రెండు రోజులుగా తూముకు చిల్లులుండడంతో కుంటలోని నీరు వృథాగా వెళ్తోంది. గ్రామస్తుల సమాచారం మేరకు శనివారం తూముకు కొత్త షట్టర్‌ బిగించేందుకు ఇద్దరు నీటిపారుదల శాఖ సిబ్బంది సాలూరకు చేరుకున్నారు. గ్రామసేవకుడు నాగయ్యను వెంట తీసుకెళ్లారు. షట్టర్‌ను బిగించే ప్రక్రియ పూర్తి చేశారు. షట్టర్‌ పూర్తిస్థాయిలో అమర్చడం కోసం నాగయ్య కుంటలోకి దిగాడు. నీటి ప్రవాహం ఒత్తిడికి కొట్టుకుపోయి తూము లోపల చిక్కిపోయాడు. బయట పడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాక ప్రాణాలు పోయాయి. విషయం తెలుసుకుని గ్రామస్తులు తరలివెళ్లి కుంట తూములో చిక్కిన నాగయ్యను బయటకు తీశారు. గజగన్‌కుంట మిషన్‌కాకతీయ పథకం రెండో విడత కింద ఎంపిక కాగా, పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. కానీ చెరువు అభివృద్ధి పనులు చేపట్ట లేదు. నీటి పారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల కుంటలోని నీరు వృథాగా పోతోంది. సకాలంలో పనులు పూర్తి చేసి ఉంటే గ్రామసేవకుడి ప్రాణాలు పోయేవి కాదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ గ్రామస్తులు సాలూర గ్రామ బస్టాండ్‌లో మహారాష్ట్రకు వెళ్లే ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. నీటిపారుదల శాఖ, కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. టౌన్‌ సీఐ వెంకన్న ఘటనా స్థలికి చేరుకుని గ్రామస్తులను సముదాయించగా ఆందోళన విరమించారు. మృతుడికి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ పెద్ద దిక్కు ఆకస్మికంగా మృత్యువాత పడడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా రోదించారు.  
మరిన్ని వార్తలు