ఎవరిదీ పాపం!

2 Mar, 2016 02:38 IST|Sakshi
ఎవరిదీ పాపం!

అనుమానాస్పద స్థితిలో చిన్నారి మృతి
పొరుగింటి బాత్‌రూంలో మృతదేహం లభ్యం
అనంతరం చెట్లపొదల్లో పడేసిన దంపతులు
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ సయ్యద్ రఫిక్
జాగిలంతో వివరాలు సేకరించిన పోలీసులు
బాలిక మృతితో గుండెలుబాదుకున్న తల్లిదండ్రులు
జవహర్‌నగర్ మండలం గబ్బిలాలపేట్‌లో విషాదం

 పొట్టకూటి కోసం కోటి కష్టాలుపడుతున్న ఆ దంపతులు నిత్యం కూలీపనులు చేస్తేనే పొట్టగడిచేది. దీంతో వారి పెద్దకూతురు అన్నీతానై తమ్ముడి, చెల్లి ఆలనాపాలన చూస్తుండేది. అంతలోనే ఏం జరిగిందో ఏమో చిన్నారి పొరుగింటి వారి బాత్‌రూంలో విగతజీవిగా కనిపించింది. ఆందోళనకు గురైన పొరుగింటి దంపతులు చిన్నారి మృతదేహాన్ని చెట్లపొదల్లో పడేశారు. అంతా అనుమానాస్పదంగా ఉన్న ఈ ఘటన జవహర్‌నగర్ ఠాణా పరిధిలోని గబ్బిలాలపేటలో మంగళవారం వెలుగుచూసింది.    -జవహర్‌నగర్

 స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన రాజు, కనకమ్మ దంపతులు పదేళ్ల క్రితం జవహర్‌నగర్కు వలస వచ్చి గబ్బిలాలపేటలోని ఓఅద్దెఇంట్లో ఉంటూ కూలీపనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. వీరికి  కుమార్తెలు యేసురాణి(6), రూతు (10 నెలలు), కుమారుడు బెంజిమెన్ (4) ఉన్నారు. ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో కనకమ్మ తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడి చివరకు బతికి బట్టకట్టింది. రాజు నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో కూలీపనులు చేస్తూ వారానికి ఓసారి ఇంటికి వస్తుండేవాడు. 

  నిత్యం తెల్లవారుజామునే నిద్రలేచే కనకమ్మ ఇంటి పనులు ముగించుకుని 5 గంటలకే పెద్ద కూతురు యేసురాణికి బెంజిమెన్, రూతు బాధ్యతలు అప్పగించే తాను కూలీపనికి వెళ్తుండేది. సాయంత్రం వరకు చిన్నారి తన తమ్ముడు, చెల్లిని కంటికి రెప్పలా కాపాడుకునేది. ఇదిలా ఉండగా, సోమవారం కన కమ్మ ఎప్పటిమాదిరిగానే వంటచేసి పనికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి యేసురాణి కనిపించకపోవడంతో తన మామ మల్లాకితో కలిసి ఆమె కోసం వెతికినా ఫలితం లేకుండాపోయింది. దీంతో వారు రాత్రి 8 గంటలకు జవహర్‌నగర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం తమ ఇంటి సమీపంలో ఓ చెత్త పొదల్లో యేసురాణి మృతదేహం కనిపించింది. ఏసీపీ సయ్యద్ రఫిక్, సీఐ నర్సింహారావు వివరాలు సేకరించారు. పోలీసు జాగిలం సంఘటనా స్థలం నుంచి మేసురాణి ఆడుకున్న సమీప ప్రదేశాల్లో తచ్చాడింది.

 పక్కింటి బాత్‌రూంలో మృతదేహం..
కనకమ్మ ఇంటిపక్కనే కూలీపనులు చేసే దస్తగిరి, సంతోష దంపతులు ఉంటున్నారు. సోమవారం రాత్రి యేసురాణి కనిపించకపోవడంతో వారు కూడా కనకమ్మతో కలిసి బాలిక కోసం గాలించారు. ఇదిలా ఉండగా, మంగళవారం తెల్లవారుజామున సంతోష నిద్రలేచి ఆరుబయట ఉన్న బాత్‌రూంకు వెళ్లింది. బాత్‌రూంలో యేసురాణి మృతదేహం చూసి భర్త దస్తగిరికి విషయం తెలిపింది. దీంతో దస్తగిరి పాపను తామే చంపారని జనం భావిస్తారనే భయంతో వెంటనే మృతదేహాన్ని ఎదురుగా ఉన్న చెట్ల పొదల్లో పడేశాడు. అనంతరం పొదల్లోంచి మృతదేహాన్ని తీసుకొచ్చాడు.

అప్పటికే చిన్నారి ముఖం, కళ్లను చీమలు కొరుక్కుతినడంతో గుర్తుపట్టరాకుండా తయారైంది. పోలీసులు డాగ్ స్క్వాడ్ రప్పించిన క్రమంలో దస్తగిరి, సంతోషలు ఏసీపీ రఫిక్ ఎదుట జరిగిన విషయాన్ని తెలిపారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. 

పాపను వాళ్లే చంపారు..
ఇంట్లో ఆడుకుంటున్న పాపను దస్తగిరి,సంతోషలే చంపి చెట్లపొదల్లోకి పడేశారని యేసురాణి తాత మల్లాకి, కుటుంబీకులు  ఆరోపించారు. సాయంత్రం నుండి తమతోనే ఉండి అందరిని నమ్మించేందుకు యత్నించారన్నారు. తెల్లవారుజామున పాప మృతదేహన్ని బయటకి తీసుకువచ్చి నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. 

తమ్ముడు, చెల్లిని తల్లి లాగా చూసుకున్నావ్ బిడ్డా..
కనిపించకుండా పోయిన బాలిక మృతదేహంగా తేలడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.  నిత్యం నేను కూలీపనికి పోతే నువ్వు చెల్లెకు, తమ్మునికి గోరుముద్దలు తినిపిస్తూ తల్లిలాగ చూసుకునే దానివి బిడ్డా.. అంతలోనే నీకు నూరేళ్లు నిండాయని మృతురాలి తల్లి కనకమ్మ రోదించిన తీరు హృదయ విదారకం. ఆమె రోదనలకు స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక తర్వాత వివరాలు తెలుస్తాయని ఏసీపీ రఫీక్ తెలిపారు. అయితే, అసలు బాత్‌రూంలోకి చిన్నారి శవం ఎలా వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు