సర్వేల భారతం!

18 Dec, 2016 03:25 IST|Sakshi

ఒంగోలు టౌన్‌: సర్వేల దెబ్బకు సిబ్బందే కాదు.. ప్రజలు కూడా బిత్తరపోతున్నారు. స్మార్ట్‌ పల్స్‌ సర్వే, ఓటర్ల సర్వేకు తోడు ఇప్పుడు ఉద్యోగ, నిరుద్యోగులకు సంబంధించిన సర్వే కూత మోగనుంది. ఎంపిక చేసిన 32 మండలాల్లో ఆదివారం నుంచి సర్వే ప్రక్రియ సాగనుంది. తహసీల్దార్‌ కార్యాలయాల్లోని సహాయ గణాంకాధికారుల ఆధ్వర్యంలో ముఖ్య ప్రణాళిక విభాగం అధికారులు  పర్యవేక్షిస్తారు.

గణన ఇలా..
ప్రతి గ్రామంలో 300 గృహాల్లో సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నారు, వారిలో 15 సంవత్సరాలకు పైబడినవారు ఎంతమంది, అందులో ఉద్యోగులు, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించనున్నారు. కార్మికుల్లో అయితే స్కిల్డ్‌ ఎంతమంది, అన్‌ స్కిల్డ్‌ ఎంతమంది అనే వివరాలను కూడా సేకరించనున్నారు. జనవరి నాటికి సర్వే ప్రక్రియను పూర్తిచేసి సంబంధిత వివరాలను ఛండీగడ్‌లోని లేబర్‌ బ్యూరోకు నివేదిస్తారు. దీనిని ఆధారం చేసుకొని జిల్లాల వారీగా ఎంతమంది నిరుద్యోగులున్నారు, వారిలో నైపుణ్యం కలిగినవారు ఎంత మంది ఉన్నారు, ఏరకమైన ఉపాధి కల్పించాలన్న దానిపై చర్చించి నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మండలాలివే..
ఒంగోలు, పుల్లలచెరువు, పీసీపల్లి, దొనకొండ, సింగరాయకొండ, మార్టూరు, అద్దంకి, పొదిలి, జే పంగులూరు, మార్కాపురం, నాగులుప్పలపాడు, మర్రిపూడి, కొమరోలు, చినగంజాం, చీరాల, వేటపాలెం, కందుకూరు, కంభం, లింగసముద్రం, ఇంకొల్లు, పెద్దారవీడు, తర్లుపాడు, దర్శి, చీమకుర్తి, జరుగుమల్లి, సంతనూతలపాడు, గిద్దలూరు, యర్రగొండపాలెం, వలేటివారిపాలెం, బల్లికురవ, ఉలవపాడు, కనిగిరి మండలాలను సర్వే కోసం ఎంపిక చేశారు.

పకడ్బందీగా నిర్వహించాలి: డిప్యూటీ డైరెక్టర్‌
జిల్లాలో ఉద్యోగ, నిరుద్యోగులకు సంబంధించిన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ప్రణాళిక విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ జి. భరత్‌కుమార్‌ ఆదేశించారు. సర్వేకు సంబంధించి ఎంపిక చేసిన మండలాల సహాయ గణాంకాధికారులతో శనివారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్‌ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సర్వే ద్వారా జిల్లాలో ఎంతమంది ఉద్యోగులున్నారు? ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో తెలుస్తుంది. అలాగే  ఉపాధి కల్పించే విషయమై ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. డిప్యూటీ ఎస్‌ఓ సీహెచ్‌ ఆదిశేషు, ప్రణాళిక విభాగం ఏడీ ఉమాదేవి, ఎస్‌ఓ రఘు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు