ప్రజాసాధికార సర్వేను నేటితో ముగించండి

12 Dec, 2016 15:20 IST|Sakshi
కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రజాసాధికార సర్వేను ఎట్టి పరిస్థితుల్లోను నేటితో(30వ తేదీ) ముగించాలని రాష్ట్ర భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్‌ అనిల్‌చంద్ర పునీత తెలిపారు. మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎల్‌ఏ మాట్లాడుతూ.. ప్రజా సాధికార సర్వేలోకి రాని వారు ఏఏ కారణాలతో దూరంగా ఉన్నారో రాతపూర్వకంగా తెలపాలన్నారు. ఎన్యూమరేటర్ల నుంచి తహశీల్దార్లు, తహసీల్దార్ల నుంచి జిల్లా కలెక్టర్‌లు సర్వే పరిధిలోకి రాని వారి పూర్తి సమాచారం సేకరించాలన్నారు. సర్టిఫికెట్లు తీసుకోవడంతో సర్వే ముగిసినట్లు అవుతుందన్నారు. సర్వే విభాగానికి సంబంధించి ఎఫ్‌ఎంబీల డిజిటలైజేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందులో తగిన నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్‌ కార్యాలయ భవనాల నిర్మాణాలకు నిధులు విడుదల చేశామని.. వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కర్నూలు నుంచి జేసీ హరికిరణ్‌ మాట్లాడుతూ... భూసేకరణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో అప్పిలేట్‌ అథారిటీని ఏర్పాటు చేయాలని, అప్పుడే రైతులు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సీసీఎల్‌ఏ స్పందిస్తూ అప్పిలేట్‌ అథారిటీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, సర్వే ఏడీ చిన్నయ్య, సెక‌్షన్‌ సూపరింటెండెంట్లు ఈరన్న, భాగ్యలక్ష్మి, రామాంజనమ్మ, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు