సర్వం సర్వేమయం

26 Jul, 2016 14:08 IST|Sakshi
 స్మార్ట్ సర్వేలో ఉద్యోగులు
 స్తంభించిన పాలన
 బోసిపోయిన కార్పొరేషన్ కార్యాలయం    
 అయోమయంలో నగర వాసులు
 
తిరుపతి శివజ్యోతి నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఇంటిపై బ్యాంక్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రూ.5 లక్షలు మంజూరైంది. అయితే టౌన్ బ్యాంక్ అధికారులు కార్పొరేషన్ నుంచి ఇన్ కార్పొరేషన్ సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్పారు.  అతను 20 రోజుల క్రితం ఆ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సంబంధిత అధికారులు, ఉద్యోగులు సర్వేలో ఉండడంతో   ఇబ్బంది పడుతున్నాడు. బ్యాంక్ అధికారులు ఫోన్ చేసి 28లోపు సర్టిఫికెట్ ఇవ్వకుంటే లోన్ రద్దవుతుందని చెప్పడంతో ఏం చేయాలో తెలియక కుమిలిపోతున్నాడు. 
 
తిరుపతి తుడా: కార్పొరేషన్ కార్యాలయం వెలవెలాబోతోంది. రెవెన్యూ, హెల్త్, టౌన్‌ప్లానింగ్, ఇజినీరింగ్, పరిపాలన, అకౌంట్స్ శాఖల్లోని ఉద్యోగులందరూ ప్రజాసాధికార సర్వేలో ఉండడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వివిధ విభాగాలకు సబంధించిన ఫైళ్లు టేబుళ్లపై ఎవరెస్ట్ శిఖరంలా పేరుకుపోతున్నాయి. అత్యవసర ఫైళ్ల పరిస్థితీ అంతే. జనన, మరణ ధ్రువీకరణ, పన్నుల చెల్లింపులు, భవన నిర్మాణ అనుమతులు ఇలా ఒక్కటేంటి అన్ని ఫైళ్లూ ముందుకు కదలడంలేదు. వివిధ సమస్యలపై కార్యాలయానికి వచ్చిన ప్రజానీకానికి కనీస సమాచారం ఇచ్చేనాథుడూ లేకుండా పోయారు.
 
అందరూ సర్వేకే
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వే మున్సిపల్ కార్పొరేషన్‌లో ఈ నెల 8 నుంచి ప్రారంభమైంది. మొదటి 14 రోజులు సర్వర్ డౌన్, నెట్‌వర్క్ సమస్యలతో సర్వే సక్రమంగా ముందుకు సాగలేదు. అయితే మొదటి విడత సర్వేను ఈనెల 31 లోపు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో స్థానిక పాలకుల్లో కదలిక వచ్చింది. ఎన్యూమరేటర్లతోపాటు కార్పొరేషన్ అధికారులను సూపర్‌వైజర్లుగా.. ఉద్యోగులను అసిస్టెంట్లుగా నియమించారు. ఇందులో చాలామందికి ట్యాబ్‌లు, బయోమెట్రిక్‌ల వినియోగం తెలియకపోవడంతో కార్పొరేషన్‌లోని అన్ని విభాగాల్లోని దాదాపు 90 శాతం మంది ఉద్యోగులను సర్వేకు కేటాయించారు. 
 
మరిన్ని వార్తలు