సన్‌స్ట్రోక్‌ @ 56

26 May, 2017 02:47 IST|Sakshi
సన్‌స్ట్రోక్‌ @ 56

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పిట్టల్లా రాలుతున్న జనం  
45 డిగ్రీలకు తగ్గని ఉష్ణోగ్రతలు  ∙సింగరేణి ప్రాంతాల్లో మరింత తీవ్రం
కనిపించని ప్రత్యామ్నాయ చర్యలు 


ఆదిలాబాద్‌/మంచిర్యాలఅగ్రికల్చర్‌: రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. భానుడి ఉగ్ర రూపంతో ఎండల తీవ్రత, వడగాలుతో జనాలు విలవిల్లాడుతున్నారు. వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్నారు. జిల్లాలో వేసవి ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు 56 మంది వడదెబ్బతో మృతిచెందారు.

ఈ ఐదు రోజుల్లోనే 15మంది మృతిచెందడం గమనార్హం. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఎండకు తట్టుకోలేక వడదెబ్బ మృతుల పెరుగుతోంది. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వడదెబ్బతో అత్యధికంగా మృతి చెందగా తరువాతి స్థానం ఆదిలాబాద్‌దే. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి ఆదిలా బాద్‌ జిల్లాలో ప్రతీరోజు 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగరేణి ప్రాంతంలో 46 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ నిప్పుల కొలిమిలా మారుతోంది.

దీంతో గని కార్మికులు కూడా పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించలేకపోతున్నారు. పాత జిల్లాలోని 52మండలాల్లోని సగం మండలాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం. రాష్ట్రం లోనే ఎక్కడా లేనంతగా జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య పెరిగిపోతోంది. కూలీ చేస్తేగానీ పొట్టగడవని పేద ప్రజలు ఎండను లెక్క చేయక పనులకు వెళ్లి అస్వస్థతకు గురవుతున్నారు. వడదెబ్బ మృతుల్లో ఉపాధి, వ్యవసాయ కూలీలే అధికంగా ఉన్నారు. వందలాది మంది అస్వస్థతకు గురవుతున్నారు.

ప్రత్నామ్నాయ చర్యలేవి..?
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటివరకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు, వడదెబ్బకు సంబంధంచిన జాగ్రత్తలు, సూచనలు ఇంతవరకు ప్రజలకు తెలియజేయడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా కనీసం ఎలాంటి మందులు గానీ, సిబ్బంది ప్రచారం గానీ చేయడం లేదు. ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలిన సమయంలో ఎలా వ్యవహరించాలో తెలి యక ఇబ్బందులు పడుతున్నారు.

రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వేసవి కార్యాచరణ రూపొందించింది. దాని ప్రకారం పట్టణాలు, పల్లెల్లో చర్యలు తీసుకో వాల్సి ఉండగా అలాంటిదేమీ కనిపించడం లేదు. అత్యంత తీవ్రత ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉన్నప్పటికీ.. పట్టించుకు న్న నాథుడే లేకుండాపోయాడు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచిర్యాల, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, మందమర్రి, జైపూర్, శ్రీరాంపూర్‌ వంటి బొగ్గు గనుల ప్రాంతాల్లో ఎండ నిప్పులు చిమ్ముతోంది. చాలా మండలాల్లో 45 డిగ్రీలకు పైగానే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కానీ ఈ ప్రాంతాల్లో అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది.


కూలీలే అధికం..
ఉమ్మడి జిల్లాల్లో వడదెబ్బతో ఎక్కువ మంది ఉపాధి, వ్యవసాయ కూలీలే మృత్యువాత పడుతుండడం గమనార్హం. ఉపాధి పనులు చేసే ప్రాంతాల్లో సరైన వసతులు కల్పించకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురైతే మెడికిల్‌ కిట్లు చాలా చోట్ల అందుబాటులో లేవు. ఉపాధి కూలీలతో పాటు, వ్యవసాయ కూలీలు ఎండలో పనికి వెళ్లి వచ్చిన తర్వాత ఇంటి వద్ద వాంతులు చేసుకుని అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.

ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత పెరిగిపోవడం, కూలీ ప్రదేశాల్లో సౌకర్యాలు లేకపోవడం వారికి శాపంగా మారింది. కూలీనాలీ చేసుకుని పొట్టగడుపుకునే వారు వడదెబ్బతో మృత్యువాత పడుతుండడంతో ఆయా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోతున్నాయి. వడదెబ్బతో మృతి చెందిన వారికి ఆపద్బంధు పథకం కింద ప్రభుత్వం రూ.50 వేలు ఆర్థికసాయం అందజేస్తోంది. ఈ పథకంపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో లబ్ధి పొందడం లేదు.  

మరిన్ని వార్తలు