వామ్మో సోషల్ ఫారెస్ట్

23 Jun, 2016 02:20 IST|Sakshi
వామ్మో సోషల్ ఫారెస్ట్

మొక్కలు నాటే కీలక సమయంలో చేతులెత్తేసిన అధికారులు
►  సెలవుల్లో వెళ్లిన డీఎఫ్‌వో
ఇక్కడ పనిచేసేందుకు జంకుతున్న అధికారులు
అస్తవ్యస్తంగా సామాజిక వన విభాగం
►  ప్రశ్నార్థకంగా హరితహారం అమలు

 
 
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : అడవిలో తిరగాల్సిన పనిలేదు.. కలప స్మగ్లర్లతో గొడవేలేదు.. కేవలం మొక్కల పెంపకం, నర్సరీల నిర్వహణ పనులు చూసుకుంటే సరిపోతుంది.. పైగా హరితహారం కార్యక్రమం పేరుతో రూ.కోట్లలో నిధులు.. ఇలా అటవీ శాఖ సామాజిక వన (సోషల్ ఫారెస్టు) విభాగంలో పనిచేసేందుకు సాధారణంగా అధికారులు, సిబ్బంది పోటీ పడుతుంటారు. కానీ.. ఇప్పుడు జిల్లాలో ఈ పరిస్థితులకు భిన్నంగా తయారైంది. నిధులు దేవుడెరుగు.. ఇప్పుడు ఈ విభాగంలో పనిచేయాలంటే అధికారులు జంకుతున్నారు. కార్యాలయంలో కీలక అధికారులు సైతం సెలవుబాట పట్టారు. వర్షాకాలం ఆరంభమైంది.. అందులోనూ మొక్కలు నాటే సీజన్ ఇది. ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం అమలులో కీలక పాత్ర పోషించాల్సిన సోషల్ ఫారెస్టు విభాగానికి ప్రస్తుతం దిక్కూమొక్కు లేకుండా పోయింది.

ఇటీవల సోషల్ ఫారెస్టు డీఎఫ్‌వోగా బాధ్యతలు తీసుకున్న గోపాల్‌రావు వారం రోజుల క్రితం సెలవుల్లో వెళ్లిపోయారు. కార్యాలయంలో పాలనా వ్యవహారాలు చూడాల్సిన సూపరింటెండెంట్ కూడా కొన్ని రోజులుగా సెలవుల్లో ఉంటున్నారు. సోషల్ ఫారెస్టు డీఎఫ్‌వోగా పనిచేసేందుకు టెరిటోరియల్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న డీఎఫ్‌వోలెవరూ ముందుకు రావడం లేదని సమాచారం. దీంతో ఆసిఫాబాద్ సబ్ డీఎఫ్‌వోగా పనిచేస్తున్న శ్రీనివాసరావుకు సోషల్ ఫారెస్టు డీఎఫ్‌వో బాధ్యతలు అప్పగించారు. కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న రెండు ఎఫ్‌ఆర్‌వోల స్థానాల్లో పనిచేసేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదని సమాచారం.


 ఎందుకీ పరిస్థితి..?
రాష్ట్రంలో ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం హరితహారం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇందుకోసం జిల్లాకు రూ.వందల కోట్లు మంజూరు చేసింది. మొదటి విడతలో ఈ కార్యక్రమానికి భారీగా నిధులు వచ్చాయి. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. మొక్కల కొనుగోళ్ల పేరుతో భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. అటవీ శాఖలో పనిచేస్తున్న అధికారులే బినామీ ఏజెన్సీలను సృష్టించి రూ.లక్షల్లో నిధులు కాజేశారు. మొక్కలను కొనుగోలు చేసినట్లు.. వాటిని నాటినట్లు రికార్డులు సృష్టించి వచ్చిన నిధులను కలిసి పంచుకున్నారు. మరోవైపు నర్సరీల పెంపకంలోనూ భారీ అక్రమాలకు పాల్పడ్డారు. నర్సరీల నిర్వహణ పేరుతో వచ్చిన నిధులను చాలాచోట్ల పక్కదారి పట్టించారు.

రాజకీయ అండదండలుండటంతో అడిగే నాథుడే లేకుండా పోయాడు. రూ.కోట్లలో హరితహారం నిధులు పక్కదారి పట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు వెళ్లడంతో ఈ అక్రమాలపై విచారణ చేపట్టారు. ఫ్లయింగ్ స్క్వాడ్ విభాగంతో శాఖ పరమైన విచారణ జరిగింది. ఈ అక్రమాలన్నీ వాస్తవమేనని తేలడంతో ఏకంగా సోషల్ ఫారెస్ట్ డీఎఫ్‌వోతో పాటు, ఇద్దరు రేంజ్ ఆఫీసర్లపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఈ హరితహారం అక్రమాలు ఇటు టెరిటోరియల్ విభాగానికి కూడా పాకింది. హరితహారం కోసం వచ్చిన నిధులను సొంతానికి వాడుకున్నారనే ఆరోపణలపై ఇటీవల మరో అధికారిని కూడా సస్పెండ్ చేశారు. ఇలా అస్తవ్యస్తంగా మారిన సోషల్ ఫారెస్టు విభాగంలో జరిగిన భారీ అవినీతి అక్రమాల తలనొప్పులు తమకెందుకనే ఉద్దేశంతో ఈ విభాగంలో పనిచేసేందుకు అధికారులెవరూ ముందుకు రావడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

పైగా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాల్సి వస్తుందనే భయంతో ఇక్కడ పనిచేసేందుకు డీఎఫ్‌వోలు ముందుకు రావడం లేదనే చర్చ ఆ శాఖ వర్గాల్లో సాగుతోంది. సస్పెన్షన్‌కు గురైన డీఎఫ్‌వో స్థానంలో కొన్ని రోజుల క్రితం గోపాల్‌రావును నియమించారు. తీరా వర్షాకాలం ప్రారంభమై హరితహారం మొక్కలు నాటే కీలక సమయంలో ఆయన కూడా సెలవుల్లో వెళ్లిపోయారు. దీంతో ఆసిఫాబాద్‌లో ఉండే సబ్ డీఎఫ్‌వోకు ఈ బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితి నెలకొంది.


 వెలుగులోకి వాస్తవాలు..
 హరితహారం పథకం వాస్తవాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రియంక వర్గీస్ ఇటీవల జిల్లాకు వచ్చి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో గతేడాది లక్షల్లో మొక్కలు నాటి నిధులు డ్రా చేసినప్పటికీ, బతికిన మొక్కలెన్నీ.. నిర్దేశిత లక్ష్యం ఏ మేరకు నెరవేరింది.. అనే అంశాలపై వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా ఉండటంతో ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ శాఖల సమన్వయంతో మొక్కలు నాటినా వాటి పెంపకం బాధ్యతలను ఆయా శాఖలు గాలికొదిలేసాయి. కనీసం ఎన్ని మొక్కలు బతికి ఉన్నాయనే సమాచారం ఏ ఒక్క శాఖ వద్ద కూడా లేదంటే ఈ హరితహారం అమలు తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రియంక వర్గీస్ పర్యటన ముగిసిన వెంటనే డీఎఫ్‌వో గోపాల్‌రావు సెలవుపై వెళ్లడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు