గ్రీన్ గణేషా

31 Jul, 2016 00:06 IST|Sakshi
గ్రీన్ గణేషా

సాక్షి, సిటీబ్యూరో: భక్త కోటి ఇష్టదైవం...బొజ్జ గణపయ్య ఈ ఏడాది పర్యావరణ ప్రియమైన రంగులతో  కనువిందు చేసేందుకు ముస్తాబవుతున్నాడు. పూలు, పండ్లు, దుంపల నుంచి  రూపొందించే ఆకర్షణీయమైన...సహజసిద్ధమైన రంగులతో  కొలువుదీరనున్నాడు. రెండు లక్షలకు పైగా చిన్న విగ్రహాలకు, మరో 10 వేల పెద్ద విగ్రహాలకు సహజమైన రంగులు అద్దేందుకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం భారీ ప్రాజెక్టును  చేపట్టింది. కాలుష్యనియంత్రణ మండలి సహకారంతో  చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా ఆగస్టు మొదటి వారం నాటికి 30 టన్నుల సహజ రంగులు  ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వీటి తయారీ..ప్రజల్లో చైతన్యం...పీసీబీ ఏర్పాట్లు తదితర అంశాలు నేటి సండే స్పెషల్‌లో...  


ప్రమాదకరమైన రసాయనాల నుంచి  జలవనరులను, పర్యావరణాన్ని పరిరక్షించే  లక్ష్యంతో వ్యవసాయ వర్సిటీలో ఈసారి గణపతి విగ్రహాలకు ఉపయోగించే సహజ రంగుల తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ మహోద్యమంలో మట్టి విగ్రహాలను రూపొందించే సంస్థలు, వ్యక్తులు, భాగస్వాములు కానున్నారు. నగరంలోని  అన్ని ప్రాంతాల్లో  ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్, కెమికల్, సింథటిక్‌ రంగుల స్థానంలో సహజమైన రంగుల వినియోగం పట్ల అవగాహన కల్పించేందుకు విద్యార్థులు, స్వచ్చందసంస్థలు కూడా భాగం పంచుకోనున్నాయి. ఇప్పటి  వరకు కేవలం మట్టి విగ్రహాలను  రూపొందించి  ప్రజలకు  అందజేసిన  కాలుష్య నియంత్రణ మండలి  ఈసారి వాటిని సహజమైన రంగులతో రూపొందించి పంపిణీ చేయనుంది. మరోవైపు ప్రజలు తాము స్వయంగా  రూపొందించే  మట్టి విగ్రహాలకు సహజ రంగులను  అద్దేందుకు కూడా తక్కువ ధరల్లో వీటిని అందుబాటులో      ఉంచుతారు.

అందుబాటు ధరల్లో సహజ రంగులు....
నగరంలోని అన్ని ప్రాంతాల్లో సహజమైన రంగులను వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నారు. విగ్రహాలను తయారు చేసే కళాకారులకు ఇప్పటికే అవగాహన కల్పించిన కాలుష్య నియంత్రణ మండలి...ప్రజల్లో సైతం అవగాహనను పెంపొందించేందుకు సన్నద్ధమవుతోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు, సైఫాబాద్‌లోని హోంసైన్స్‌ కళాశాలలోనూ, ఎంపిక చేసిన హస్తకళా కేంద్రాలు, సూపర్‌ మార్కెట్‌లలోనూ  ఈ రంగులను విక్రయిస్తారు. ఒక లీటర్‌ రంగు ధర  రూ.200 నుంచి రూ.300ల వరకు ఉంటుంది. బేసిక్‌ కోసం  వినియోగించే తెలుపు రంగును రూ.100 కు లీటర్‌ చొప్పున విక్రయిస్తారు. ధూల్‌పేట్, ఎల్‌బీనగర్, నాగోల్, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో  తయారు చేసే విగ్రహాలకు కూడా సహజమైన రంగులను వినియోగించేందుకు కాలుష్య నియంత్రణ మండలి ప్రోత్సహిస్తోంది. తయారీదారులకు అవగాహన కల్పిస్తోంది.

సహజ రంగులకు ఇలా శ్రీకారం...
ప్రమాదకరమైన రసాయనాల కారణంగా హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే  చెరువులన్నీ కాలుష్య కాసారాలయ్యాయి. పర్యావరణానికి కూడా ఈ రసాయనాలు పెద్ద ముప్పుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో  2006 లో యునెస్కో  సహకారంతో  వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. సహజమైన రంగుల వినియోగం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ  ఈ సదస్సు లక్ష్యం. ఆ మరుసటి సంవత్సరం నుంచి నేషనల్‌ అగ్రికల్చరల్‌ ఇన్నోవేటివ్‌ ప్రాజెక్టులో భాగంగా హోమ్‌సైన్స్‌ కళాశాల సహజరంగులను రూపొందించే సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసింది.

మొదట వస్త్రాలకు ఈ సహజమైన రంగులను అద్దారు. ఆ తరువాత హోలీ రంగులను సిద్ధం చేశారు. క్రమంగా వినాయక విగ్రహాలను సైతం సహజమైన రంగులతో అలంకరించేందుకు పండ్లు, పూలు, ఆకులు, బెరళ్లు, వివిధ రకాల దుంపల నుంచి రంగులను తయారు చేయడంపైన దృష్టి సారించారు. ఈ రంగుల నాణ్యత, ఆకర్షణపై  హోమ్‌సైన్స్‌ కళాశాల ఎమిరిటస్‌ సైంటిస్ట్‌  శారదాదేవి ప్రత్యేకంగా దృష్టి సారించారు. 2008లో 500 విగ్రహాలతో  ప్రారంభమైన ఉద్యమం 2014లో 5000 దాటింది. చిన్న చిన్న  విగ్రహాలతో పాటు, 5 నుంచి  6 ఫీట్లు ఉన్న  వినాయక విగ్రహాలకు సైతం సహజరంగులను సిద్ధం చేశారు.

అలా  ప్రారంభమైన ఈ  కార్యక్రమం  ఇప్పుడు రూ.కోటితో అతి పెద్ద ప్రాజెక్టుగా ముందుకు వచ్చింది. తెలుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ, నారింజ, ఎరుపు, గులాబీ వంటి 12 ప్రాథమిక రంగులు, వివిధ రకాల రంగుల కాంబినేషన్‌లతో  మొత్తం  56 రకాల రంగులతో విగ్రహాలను అలంకరించే విధంగా ఈ సహజరంగులను తయారు చేస్తున్నారు. 2 లక్షల చిన్న విగ్రహాలకు, 10 వేలకు పైగా  పెద్ద విగ్రహాలకు రంగులను సిద్ధం చేయడం ఇదే మొట్టమొదటిసారి.

నగరంలో వినాయకుడి మండపాలు ఇలా...
ప్రధాన మండపాలు    :    లక్ష
చిన్న విగ్రహాలు         :    8 లక్షలు
ఈ ఏడాది  సహజ రంగులతో పెద్ద విగ్రహాలు    :    10 వేలు
చిన్న విగ్రహాలు         :    2 లక్షలు
సహజ రంగుల కోసం  ప్రజలు, సంస్థలు,
కళాకారులు సంప్రదించాల్సిన నెంబర్లు : 04023241059, హోంసైన్స్‌ కళాశాల.
ఎప్పటి నుంచి అందుబాటులోకి         :    ఆగస్టు  మొదటి వారం.

>
మరిన్ని వార్తలు