వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి

17 Jul, 2016 19:00 IST|Sakshi
వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి

చేవెళ్ల: గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని వీఆర్‌ఏల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అమీరోద్దీన్‌ తెలిపారు. చేవెళ్ల డివిజన్‌ పరిధిలోని నాలుగు మండలాల వీఆర్‌ఏల సమావేశం ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వీఆర్‌ఏలు గ్రామాల్లో పనిచేస్తున్నా సమస్యలను పరిష్కరిం చడంలో సర్కార్‌ చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకున్న వీఆర్‌ఏలకు అర్హతలను బట్టి పదోన్నతులు కల్పించాలన్నారు. వీఆర్‌ఏలలో ఎవరైనా మృతిచెందినా, స్వచ్ఛంద పదవీ విరమణ చేసినా వారి స్థానంలో వారసులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా నెలకు కనీసం  రూ.15వేల వేతనం ఇవ్వాలని పేర్కొన్నారు. సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి జంగయ్య మాట్లాడుతూ. వీఆర్‌ఏల సమస్యల పరిష్కారంకోసం ఈనెల 30, 31 తేదీల్లో తాండూరులో ఏర్పాటుచేసిన వీఆర్‌ఏల సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ వీఆర్‌ఏ సంక్షేమ సంఘం ప్రతినిధులు నర్సింహులు, లింగం, రవీందర్, సత్తయ్య, మల్లేష్, శాంతమ్మ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు