ప్రకృతి అందాల సోమశిల

9 Sep, 2016 21:40 IST|Sakshi
ప్రకృతి అందాల సోమశిల

కృష్ణా పుష్కరాల నేపథ్యంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన చూడచక్కని చోటు.. ఘాట్‌లలో ఒకటిగా మాత్రమే కాకుండా ప్రకృతి అందాలతో అలరించే చక్కటి వీకెండ్‌ స్పాట్‌ సోమశిల. ఏడో శతాబ్దానికి చెందిన ఆలయాలు, రెండు నదుల సంగమం.. ఇలా అనేక ఆకర్షణలు ఉన్న ఈ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.         – ఓ మధు

సోమశిల.. తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ స్థలం. ఇక్కడి నుంచే ఈ రెండు నదులు నల్లమల అడవుల్లోకి ప్రవేశిస్తాయి. దేశంలోని 12 జ్యోతిర్లింగాలకు ప్రతీకగా ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేశారు. ఇలాంటి అనేక ప్రత్యేకతలు, అంతకు మించి ప్రశాంతత లభించే చోటు కావడంతో ఏడాది పొడువునా పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకర్షించే ప్రదేశంగా మారింది సోమశిల.  

ఆధ్యాత్మికత.. ప్రకృతి రమణీయత
ఏడో శతాబ్దానికి చెందిన లలితా సోమేశ్వర్‌ స్వామి ఆలయానికి సోమ, శుక్రవారాల్లో జనం అధికంగా వస్తుంటారు. శివరాత్రి, దసరా, దీపావళి, సంక్రాంతి, కార్తిక మాసం, తొలి ఏకాదశి... ఇలా పండుగ, సెలవుల దినాల్లో సందర్శకులు పోటెత్తుతారు. ఈ ప్రాంతానికి మరింత ఆకర్షణ జోడించే క్రమంలో సోమశిల రిజర్వాయర్‌లో బోటింగ్‌ సదుపాయం కూడా కల్పించారు.

అమరగిరి, సిద్ధేశ్వరం, సంగమేశ్వరం దుర్గం గుహలు.. తదితర చుట్టు పక్కల ఉన్న సందర్శనీయ ప్రదేశాలను బోట్‌లో వెళ్లి చూడడం చక్కని అనుభూతిని అందిస్తుంది. రిజర్వాయర్‌ మధ్యలో ఉన్న సంగమేశ్వర ఆలయాన్ని నీటి నిలువ తగ్గినప్పుడు మాత్రమే చూడొచ్చు. అదే విధంగా కొల్లాపూర్‌ మాధవస్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు. శిల్పాలు, దైవ ప్రతిమలతో ఉన్న మ్యూజియం కూడా ఉంది.  

వెళ్లడం ఇలా...
నగరం నుంచి 180 కి.మీ దూరంలో, మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి 99 కి.మీ దూరంలో ఉందీ టూరిస్ట్‌ స్పాట్‌.

మరిన్ని వార్తలు