సమగ్ర సోమశిల.. కలేనా!

16 Aug, 2016 01:17 IST|Sakshi
 
సోమశిల: సోమశిల జలాశయంలో 78 టీఎంసీల పూర్తి సామర్థ్యం మేరకు నీటి నిల్వ చేయడంలో  రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. సోమశిల జలాశయాన్ని 1982 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో 1975లో అప్పటి ప్రభుత్వం  పనులను ప్రారంభించింది. పనుల్లో అలసత్వం కారణంగా 1988లో జలాశయం తొలి దశ (స్పిల్‌వే విభాగం) పనులు పూర్తయ్యాయి. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ఈ జలాశయాన్ని జాతికి అంకితం చేశారు. అప్పట్లో జలాశయం సామర్థ్యం 37 టీఎంసీలకు పరిమితం చేశారు. ఇందులో డెల్టా పరిధిలో 1.75 లక్షల ఎకరాలు, నాన్‌ డెల్టా పరిధిలోని ఉత్తర, దక్షిణ కాలువల పరిధిలో 10 వేల లోపు ఎకరాలకు సాగునీరు పంపిణీ జరిగేది. అప్పటి నుంచి 2000 సంవత్సరం వరకు ఒక్క టీఎంసీ కెపాసిటీ కూడా పెరగలేదు. పెంచే విధంగా అప్పటి ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు. అప్పట్లో అనూహ్యంగా భారీ వరదలు రావడంతో జలాశయం 37 టీఎంసీలకు దాటింది. జలాశయం లోతట్టు ప్రాంతాల్లోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. బాధితులకు పరిహారం చెల్లించకుండానే జలాశయం సామర్థ్యం 42 టీఎంసీలకు పెంచారు. అనంతరం ఆయా గ్రామాలకు అప్పటి ప్రభుత్వం కొంత మేర పరిహారం చెల్లించి ఖాళీ చేయించారు.
పరిహాసంగా పరిహారం పంపిణీ  
సమగ్ర సోమశిలకు అప్పటి సర్వే ప్రకారం వైఎస్సార్‌ జిల్లాలో  330 కాంటూర్‌ పరిధిలో 105 గ్రామాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ 105 గ్రామాలకు పరిహారం చెల్లించి తొలిసారిగా రికార్డు స్థాయిలో జలాశయంలో 71 టీఎంసీల నీటి నిల్వ చేశారు. దీంతో 330 కాంటూర్‌లో గుర్తించిన గ్రామాల కంటే అదనంగా మరిన్ని గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. ఊహించని పరిణామంతో బెంగళూరు సర్వే కంపెనీతో మళ్లీ కాంటూరు సర్వే చేయించారు. ఈ సర్వేలో అట్లూరు మండలంలోని చంతువారి పల్లి, వరికుంట, వరి కుంట దళితవాడ  ముంపునకు గురవుతున్నట్లు అధికారులు గర్తించారు. వీటికి పరి హారం చెల్లించేందుకు ప్రభుత్వం తీర్మానిం చింది. గతంలో మాదిరిగా ఈ ప్రాంతాల్లో కూడా వందలాది అక్రమ నిర్మాణాలు వెలి శాయి. ముంపు వాసుల పరిస్థితి ముందే గమనించిన ప్రభుత్వం ఆయా గ్రామాల్లో అప్పటి వరకు ఉన్న పరిస్థితిని వీడియో ద్వారా చిత్రీకరణ చేసింది. నాటికి నేటికి ఇళ్ల నిర్మాణాల సంఖ్య అంతకంతకు పెరిగిపోవడంతో అధికారులు, గ్రామస్తుల మధ్య పరి హారం పంపిణీ వివాదాస్పదమైంది. అన్ని ఇళ్లకు పరిహారం చెల్లించలేదని వారు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అధికారులు మిన్నకుండిపోయారు. కోర్టు తీర్పు ఆధారంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కోర్టు తీర్పు వెలువడే వరకు సోమశిల పూర్తి సామర్థం నెరవేరదన్నది అక్షర సత్యం.
వైఎస్సార్‌ హయాంలోనే 73 టీఎంసీలకు పెంపు
2004లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జల ప్రాజెక్ట్‌లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో రాష్ట్రంలో పలు ప్రాజెక్ట్‌లు, జలాశయాల రూపురేఖలు మారిపోయాయి. అందులో సోమశిల దశ తిరిగింది. వైఎస్సార్‌ సీఎం అయిన ఏడాది లోపే 2005 నాటికి ముంపు బాధితులకు పరిహారం అందించి జలాశయాన్ని 50 టీఎంసీల సార్థ్యానికి పెంచారు. అనంతరం అంచెలంచెలుగా జలాశయం నీటి నిల్వ సామర్థ్యాన్ని 2009 నాటికి 70 టీఎంసీలకు పెరిగింది. 2010లో 73 టీఎంసీల నీరు నిల్వ చేయగలిగారు. అనంతరం పాలకులు ప్రాజెక్టు నిల్వ సామర్థ్యాన్ని పెంపునకు నిధులు కేటాయింపునకు చర్యలు తీసుకోకపోవడంతో సమగ్ర సోమశిల పగటి కలగానే మిగలనుందని రైతాంగం ఆందోళన చెందుతుంది.
 
 
కోర్టు పరిశీలనలో ఉంది
సోమశిల జలాశయం ముంపు గ్రామాల్లో పరిహారం విషయమై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. బాధితులు హైకోర్టుకు వెళ్లడంతో సమస్య జఠిలమైంది. కోర్టులో నడుస్తున్న ఈ వ్యవహారం పరిష్కారమైతే గానీ సోమశిల జలాశయం పూర్తి సామర్థ్యం (78 టీఎంసీల) నీటి నిల్వకు అవకాశం లేదు.
– దేశ్‌ నాయక్, ఈఈ, సోమశిల  
మరిన్ని వార్తలు