అటకెక్కిన ఉచిత వైఫై ప్రాజెక్టు

1 Sep, 2016 22:06 IST|Sakshi
అటకెక్కిన ఉచిత వైఫై ప్రాజెక్టు

సాక్షి,సిటీబ్యూరో: మహానగరాన్ని వై–ఫై సిటీగా మార్చేందుకు సర్కారు గతంలో సిద్ధంచేసిన ప్రణాళికలు అటకెక్కాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ నగరంలో 45 చోట్ల ఏర్పాటు చేసిన వై–ఫై హాట్‌స్పాట్‌ల వద్ద కూడా ఉచిత సేవలు తొలి పదిహేను నిమిషాలకే పరిమితమయ్యాయి. ఆపై ప్రతి మెగాబైట్‌ డేటా వినియోగానికి 8 పైసల చొప్పున చార్జీ వసూలు చేస్తున్నారు. దీంతో గ్రేటర్‌ పరిధిలో మూడువేల ఉచిత వై–ఫై హాట్‌స్పాట్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం దీనిని పట్టించుకోకపోవడంతో  వై–ఫై ప్రాజెక్టు అలంకార ప్రాయంగా మారిందని ఆరోపణలు వినవస్తున్నాయి.

నగరంలో హాట్‌స్పాట్స్‌ ఏర్పాటుకు బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4500 కి.మీ మేర ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్నా..వీటి ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, రాయితీలపై వారికి సహకారం అందించేందుకు సర్కారు ముందుకు రాకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

అటకెక్కిన వై–ఫై  ప్రాజెక్టు..!
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో  భాగంగా మూడువేల ఉచిత వై–ఫై హాట్‌స్పాట్స్‌ ఏర్పాటు చేయాలని  ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సహకారంతో నగరంలో జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతాల్లో 45 వై–ఫై హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేశారు. తొలుత 30 నిమిషాలు ఉచితంగా  వై–ఫై సేవలను అందించినా..గిట్టుబాటు కావడం లేదన్న కారణంగా వాటిని ప్రస్తుతానికి 15 నిమిషాలకు కుదించారు. ఆ తరవాత డేటా రీఛార్జి కార్డులను కొనుగోలు చేసి వాడుకునే సౌకర్యాన్ని కల్పించారు.

625 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్‌ పరిధిలో మరో మూడువేల హాట్‌స్పాట్స్‌ ఏర్పాటుకు సుమారు రూ.12 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తూ, సదరు సంస్థ ప్రభుత్వం నుంచి 50 శాతం రాయితీని ఆశిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వీటిని బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ నుంచి ఉచిత అనుమతులు కోరుతోంది. ప్రతి హాట్‌స్పాట్‌ పరికరానికి ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని కోరుతుండగా, మీటర్‌ కనెక్షన్‌ తీసుకోవాల్సిందేనని సీపీడీసీఎల్‌ మెలిక పెట్టడంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు.

ఐటీ జోన్‌లోనూ మూన్నాళ్ల ముచ్చటే..
తొలి అరగంట ఉచిత వై–ఫై సేవలు అందించేందుకు మాదాపూర్,సైబర్‌టవర్స్‌ ప్రాంతాల్లో ఎయిర్‌టెల్‌ సంస్థ ఏడాది క్రితం ఏర్పాటు చేసిన 17 హాట్‌స్పాట్స్‌ వద్ద  ప్రస్తుతంSఉచిత సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం నుంచి ఆశించిన మేరకు సహకారం,రాయితీలు అందకపోవడంతో ఉచిత వై–ఫై సేవలను నిలిపివేసినట్లు విశ్వసనీయ సమాచారం.

నాగ్‌పూర్‌ జిల్లా ఆదర్శం....
నగరంలో వై–ఫై ప్రాజెక్టు అటకెక్కినా..మహారాష్ట్రలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ ఆధ్వర్యంలో నాగ్‌పూర్‌ జిల్లాలో 770 వై–ఫై హాట్‌స్పాట్స్‌ ఏర్పాటుకు పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే 300కు పైగా హాట్‌స్పాట్స్‌ ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. ఆ జిల్లా వ్యాప్తంగా వై–ఫై సేవలు అందించేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తోందని, హైదరాబాద్‌లో ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం కనిపించడంలేదని ఆ సంస్థ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఉచిత సేవల వినియోగంలో ఎంజీబీఎస్‌ టాప్‌..
ఉచిత వై–ఫై వినియోగానికి సంబంధించి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏర్పాటు చేసిన హాట్‌స్పాట్‌లలో మహాత్మగాంధీ బస్‌ స్టేషన్‌ అగ్రగామిగా నిలిచింది. స్టేషన్‌ ప్రాంగణంలో ప్రయాణీకులు తమ మొబైల్‌ ఫోన్ల ద్వారా అత్యధికంగా ఉచిత వై ఫై సేవలు వినియోగించుకుంటున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. మహా నగరం లోని సుమారు 45  రద్దీ  ప్రాంతాల్లో హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేయగా, ఇందులో 15 హాట్‌ స్పాట్స్‌ వద్ద వినియోగం అధికంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు.

మొత్తం హాట్‌ స్పాట్స్‌లో మే నుంచి సెప్టెంబర్‌  వరకు సుమారు లక్షకు పైగా  మంది 6563.13 (జీబీ)నిడివిగల సమాచారాన్ని వినియోగించుకునట్లు తెలుస్తోంది. ఇందులో ఎంజీబీఎస్‌ వద్ద సుమారు 27,534  మొబైల్‌ ఫోన్లæ ద్వారా 792.64 జీబీ వినియోగించుకున్నారు. ప్రతి హాట్‌ స్పాట్స్‌ లో ఉచిత వై ఫై సేవల ద్వారా ప్రతి రోజు  80 నుంచి 100 జీబీ వరకు డేటా వరకు వినియోగమవుతోంది.  ప్రతిరోజు సుమారు మూడు వేల మంది వరకు ఉచిత సేవలను వినియోగిస్తున్నట్లు  అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు