నాడిపట్టకుండానే మందులు రాస్తున్నారు

27 Aug, 2016 20:46 IST|Sakshi
మాట్లాడుతున్న జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి

సాక్షి, సిటీబ్యూరో: కొందరు వైద్యులు సామాజిక బాధ్యతను మరిచిపోయి సంపాధనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. మానవత్వాన్ని మరచి అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన నిరుపేదలను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. శనివారం హోటల్‌ ఆవాసలో జరిగిన కార్డియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా తెలంగాణ చాప్టర్‌ వార్షిక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం అన్ని వృత్తుల్లో చెడు ఉన్నట్లే వైద్య వృత్తిలోనూ చెడు ఉందన్నారు.

మానవతా దృక్ప«థంతో అందించాల్సిన వైద్య సేవలను వ్యాపారంగా మార్చి “వైద్యో నారాయణోహరి’ అన్న పదానికి విలువ లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మందులతో తగ్గని మొండి రోగాలను సైతం ఆత్మీయ పలకరింపు, స్పర్శతో తగ్గించే అవకాశం ఉందని, వైద్యపరంగా ఇది ఎన్నోసార్లు నిరూపితమైందన్నారు. అయితే కొందరు వైద్యులు రోగులు చెప్పిన విషయాన్ని పూర్తిగా వినకపోవడమే కాకుండా కనీసం బీపీ చెక్‌చేయకుండా, నాడీ పట్టి చూడకుండా మందులు రాసేస్తున్నారని, రోగుల ఆగ్రహానికి గురవడ మే కాకుండా న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు.

జబ్బులు, చికిత్సలు, మందులపై రోగుల్లో అవగాహన పెరిగిందన్న విషయాన్ని వైద్యులు గుర్తుంచుకోవాలన్నారు. నగరవాసులకు మాత్రమే గుండెజబ్బులు రావడం లేదని, మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలు కూడా గుండె జబ్బుతో బాధపడుతున్నారన్నారు. అయితే వీరిలో చాలా మంది చికిత్సకు నోచుకోలేక పోతుండటం దారుణమన్నారు. సామాజిక బాధత్యగా ప్రతి వైద్యుడు నెలలో ఒక్కరోజైనా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి రోగులకు చికిత్సలు అందించాలని సూచించారు.

కార్డియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా టి.చాప్టర్‌ అధ్యక్షుడు జె.శివకుమార్‌ మాట్లాడుతూ సదస్సులో భాగంగా ప్రైమరీ యాంజియోప్లాస్టీ చికిత్సలపై 300 మంది కార్డియాలజిస్టులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో  డాక్టర్‌ నరసరాజు,  డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి పెద్ది, డాక్టర్‌ సీతారామ్, డాక్టర్‌ శ్రీధర్‌ కస్తూరి తదితరులు పాల్గొన్నారు.



 

మరిన్ని వార్తలు