మరిన్ని డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటు

13 Oct, 2016 22:58 IST|Sakshi
మరిన్ని డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటు
 ఏలూరు సిటీ : జిల్లాలో మరిన్ని డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ కె.శంకరరావును కలెక్టర్‌ కె.భాస్కర్‌ ఆదేశించారు. గురువారం వైద్య శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాడేపల్లిగూడెం, ఏలూరులలో డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, తణుకులో కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వాటితో పాటు జంగారెడ్డిగూడెం, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, కొవ్వూరులో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డీసీహెచ్‌ఎస్‌ను ఆదేశించారు. జిల్లాలో మాతా శిశు మరణాలు, ప్రభుత్వ,ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఎంతమంది గర్భిణులు ప్రసవిస్తున్నారు, ఎంతమంది పిల్లలు మరణిస్తున్నారనే వివరాలను కచ్చితంగా సేకరించాలని వైద్యాధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. మలేరియా, డెంగీ, వైరల్‌ ఫీవర్స్‌ తదితర వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో కె.కోటేశ్వరిని ఆదేశించారు.  
అంగన్‌వాడీ చిన్నారులకు నూతన విద్యావిధానం
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో చదివే చిన్నారులకు నీతికథలు, సూక్తులు తెలియచేసి వారిలో చదువుపై ఆసక్తి పెంచే నూతన విద్యను అందించేందుకు ప్రత్యేక నీతి కథలు పుస్తకాన్ని 15 రోజుల్లో సిద్ధం చేయాలని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖా పనితీరుపై అధికారులతో సమీక్షించారు. అంగన్‌వాడీ కేంద్రాలంటే కోడిగుడ్డు, అన్నం పెట్టే శిబిరాలుగా మాత్రమే చూడవద్దని చిన్న వయసు నుంచే నీతికథలు బోధించి వారిని ఆకట్టుకునే రీతిలో విద్య  అందించాలని కలెక్టర్‌ కోరారు.
15న అంతర్జాతీయ హ్యాండ్‌వాష్‌
15న ప్రపంచ వ్యాప్తంగా చేతులు పరిశుభ్రపరిచే దినోత్సవాన్ని జరుపుతున్న దృష్ట్యా ప్రతి పాఠశాలలోనూ ఈ కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. 435 హైస్కూల్స్‌లో పూర్తి స్థాయిలో కంప్యూటర్లను ఏర్పాటు చేసి 7,200 మంది ఉపాధ్యాయులు విధిగా బయోమెట్రిక్‌ హాజరు వేసేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు జేసీ ఎంహెచ్‌. షరీఫ్, డీఈవో డి.మధుసూదనరావు, సర్వశిక్షాభియాన్‌ పీవో వి.బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
 
>
మరిన్ని వార్తలు