సంతోషం కొంతే!

20 Mar, 2017 23:33 IST|Sakshi
సంతోషం కొంతే!
ఎమ్మెల్సీ గెలుపుపై టీడీపీ నేతల్లో కనిపించని ఆనందం
– మెజార్టీ తగ్గడంతో ఎక్కడో గుబులు
– భారీగా డబ్బులు వెదజల్లి.. సీఎం రంగంలోకి దిగినా దిగదుడుపే
– అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని శిల్పా హెచ్చరికలు
– చర్యలు తప్పవని ఘాటు వ్యాఖ్యలు
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ అధికార తెలుగుదేశం పార్టీ నేతల్లో ఎక్కడో అసంతృప్తి వ్యక్తమయ్యింది. ఎమ్మెల్సీగా అధికార పార్టీ అభ్యర్థి విజయం సాధించినా ఆ సంతోషం పెద్దగా కనిపించని పరిస్థితి. మెజార్టీ భారీగా తగ్గడంతో ఎక్కడో గుబులు కనిపించింది. అడుగడుగునా ఇది గెలుపు కాదని.. చావుతప్పి కన్ను లొట్టపోయినట్టుగా తమ పరిస్థితి తయారైందని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తన గెలుపునకు కొందరు పనిచేయలేదని.. వారి జాబితాను ఇప్పటికే తయారు చేశామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్నికల విజేత శిల్పా చక్రపాణిరెడ్డి ప్రకటించారు. ఇలాంటి నేతలపై చర్యలు తప్పవని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. తన గెలుపుపై తనకే పెద్దగా సంతృప్తి లేదన్నారు. తమ పార్టీలోకి 5గురు విపక్ష ఎమ్మెల్యేలు చేరిన తర్వాత కూడా మెజార్టీ తగ్గడాన్ని నియోజకవర్గాల వారీగా అధ్యయనం చేస్తామని వెల్లడించారు. అనంతరం అధిష్టానానికి ఫిర్యాదు చేసి.. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు కౌంటింగ్‌ కేంద్రం వద్దకు వచ్చిన అధికార పార్టీ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించడం గమనార్హం. 
 
చావుతప్పి..
తమ పార్టీ అభ్యర్థి గెలిచినప్పటికీ కౌంటింగ్‌ కేంద్రం వద్దకు వచ్చిన టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేఈ ప్రభాకర్‌తో పాటు కేఈ ప్రతాప్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. నైతికంగా గెలుపు తమదేనన్న గౌరు వ్యాఖ్యలను మరికొద్ది మంది టీడీపీ నేతలు కూడా సపోర్టు చేయడం గమనార్హం. పార్టీలోకి ఏకంగా 5గురు ఎమ్మెల్యేలు వచ్చినా వైసీపీకి ప్రజాబలం తగ్గకపోగా పెరగడం బట్టి చూస్తే తాము పునారోలించుకోవాల్సిందేనన్న అభిప్రాయం వారిలో వ్యక్తమయ్యింది. అయితే, ఎంత ఖర్చు చేసినప్పటికీ.. మెజార్టీ తగ్గిన నేపథ్యంలో సహకరించని వారిపై ఫిర్యాదు చేస్తానని శిల్పా చక్రపాణి రెడ్డి ప్రకటనపై ఆ పార్టీలో చర్చ రేపుతోంది. అలాంటి వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరోవైపు భారీగా డబ్బులు వెదజల్లినా.. చివరి రెండు రోజుల్లో నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగినా తమ పరిస్థితి ఇంతేనా అని వాపోతున్నారు. 
 
ఆ ఎమ్మెల్యేలు వచ్చినా..!
వాస్తవానికి రెండేళ్లక్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శిల్పా చక్రపాణి రెడ్డికి 147 ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే, ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన 5గురు ఎమ్మెల్యేలు అధికారపార్టీలో చేరారు. వీరితో పాటు పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు పార్టీలు మారారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో మెజార్టీ మరింత పెరుగుతుందని.. కనీసంలో కనీసం 200 వరకూ వస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేసుకున్నారు. ఇదే అంశాన్ని తమ నివేదికలో అధిష్టానానికి వెల్లడించారు. అయితే, ఇందుకు భిన్నంగా మెజార్టీ భారీగా తగ్గడంతో ఆ పార్టీ నేతలకు మింగుడుపడలేదు.
 
తమ ఇన్‌చార్జీలు, ఎమ్మెల్యేలు బాగానే చేశారని శిల్పా ప్రకటించారు. తద్వారా పరోక్షంగా పార్టీ మారిన నేతలు సహకరించలేదని తన అభిప్రాయాన్ని ఆయన గెలిచిన వెంటనే వెలిబుచ్చారు. అంతేకాకుండా ఎవరెవరు సహకరించలేదో తమకు తెలుసునని.. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆయన అనుమానిస్తున్నారని.. వారు తమ పార్టీలోకి వచ్చినప్పటికీ పెద్దగా ఉపయోగం జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి పార్టీ మారిన నేతలకు– అప్పటికే ఉన్న ఇన్‌చార్జీలకు మధ్య మరోసారి విభేదాలు పొడచూపే అవకాశం కనిపిస్తోంది. 
 
కొసమెరుపు: శిల్పా వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ మారిన నేతలెవ్వరూ కౌంటింగ్‌ వద్ద కనపడకపోవడం గమనార్హం.
 
మరిన్ని వార్తలు