ఏది లాభమో..!

14 Jul, 2016 02:08 IST|Sakshi
ఏది లాభమో..!

మల్లన్నసాగర్‌పై వీడని మల్లగుల్లాలు..
కొందరు సై.. మరికొందరు నై
నిన్న బంజేరుపల్లి, లక్ష్మాపూర్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తుల అంగీకారం
నేడు అవే గ్రామాలకు చెందిన కొందరి నిరసనలు
భూసేకరణ చట్టం 2013.. 123 జీవోలలో ఏం ఉంది?
వాస్తవ పరిస్థితులపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన

‘ముంపు’ సమస్య కొలిక్కి రాలేదు. ఒకపక్క భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చేందుకు రైతులు వరుస.. మరోపక్క ఇచ్చేది లేదని ఇంకొందరి నిరసన.. బ్రాహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాలు ప్రభుత్వానికి భూములు అప్పగించే జాబితాలో చేరిపోగా, అవే గ్రామాల్లోని కొందరు ఏది లాభమో.. ఏది నష్టమో నిర్ధారించుకోలేని సందిగ్ధంలో పడ్డారు. మంత్రి హరీశ్‌రావుతో చర్చలకు వచ్చినప్పుడు భూములు ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధమని ప్రకటిస్తున్నారు. తీరా వెనక్కి వచ్చాక.. ‘భూసేకరణ చట్టం 2013 ప్రకారం ఎక్కువ డబ్బులు వస్తాయి’ అనే మాటలు చెవిన పడగానే.. మళ్లీ పిడికిలి బిగిస్తున్నారు.

నష్టపరిహారం కోసం 40 రోజులపాటు ఉమ్మడిగానే కొట్లాడిన పల్లె జనం ఇప్పుడు రెండుగా చీలిపోయారు. 70 శాతం మంది 123 జీఓకు, మరో 30 శాతం 2013 భూ సేకరణ చట్టానికి అనుకూలంగా విడిపోయారు. ఈ నేపథ్యం ‘సాక్షి’ వాస్తవ పరిస్థితిని ప్రజలను వివరించే ప్రయత్నం చేసింది. ప్రధాన సమస్యలైన భూమి, ఇళ్లు, ఉపాధి అంశాలపై కలెక్టర్ రోనాల్డ్‌రోస్, మంత్రి హరీశ్‌రావు, రైతు సంఘం నాయకుడు పాకాల శ్రీహరిరావు, న్యాయ నిపుణులు, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారుల అభిప్రాయాలను సేకరించింది. వారి అభిప్రాయాలను క్రోడీకరించి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులతో బేరీజు వేసి పొందుపరుస్తున్న కథనం.. 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్ డి: తొగుట మండలంలో 50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. రిజర్వాయర్, పైపులైన్లు తదితరాల కోసం 14 గ్రామాల్లో  20,079.16 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తోంది. ఇందులో ఐదు గ్రామాలు పూర్తిగా.. మరో 9 గ్రామాల్లో భూములు పోతున్నాయి. ఈ క్రమంలో ఏటిగడ్డ కిష్టాపూర్‌లో 2,526 ఎకరాలు, 409 ఇళ్లు, వేములఘాట్‌లో 5,398 ఎకరాల సాగు భూమి, 544 ఇళ్లు, తుర్క బంజేరుపల్లిలో 71 ఇళ్లు, తొగుటలో 2,703 ఎకరాలు, తుక్కాపూర్‌లో 972.10, ఎల్లారెడ్డిపేటలో 142. 30 ఎకరాలు, బ్రాహ్మణ బంజేరుపల్లిలో 137, వడ్డెర కాలనీ 100, తిరుమలగిరిలో 68, మొగుళ్లచెరువు తండా లో 93, లక్ష్మాపూర్ 150 ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి.

తుక్కాపూర్‌లో 972.10 ఎకరాలు, తొగుట, బ్రాహ్మణ బంజేరుపల్లిలో 2,703 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 142.30 ఎకరాల భూమి పైపులైన్ల నిర్మాణానికి పోతోంది. కొండపాక మండలం పల్లెపహాడ్ రెవెన్యూ పరిధిలో 1,199 ఎకరాలు, 320 ఇళ్లు, దస్తగిరి నగరంలో 162 ఇళ్లను కోల్పోతున్నారు. తిప్పారంలో 2,344.1 ఎకరాలు, 250 ఇళ్లు, మదిర గ్రామమైన సింగారంలో 120 ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి. ఎర్రవల్లిలో 2,297 ఎకరాలు, 348 ఇళ్లు, మంగోల్‌లో 1,851.36 ఎకరాలు, 450ఇళ్లు, కాశీ గుడిసెలులో 20 ఇళ్లు, కోనాయిపల్లిలో 444ఎకరాలు, 105 ఇళ్లు, వడ్డెర కాలనీలో 15ఇళ్లు కోల్పోతున్నారు. మాత్‌పల్లిలో 44ఎకరాలు, మేదినీపూర్‌లో 117 ఎకరాలు, ముద్దారంలో 40.19 ఎకరాల సాగు భూమిని పైప్‌లైన్ల నిర్మాణం కోసం సేకరిస్తున్నారు.  

భూసేకరణ చట్టం 2013 ప్రకారమైతే...
2013 భూ సేకరణ చట్టం గెజిట్, సెక్షన్ 26(1) ప్రకారం రిజిస్ట్రేషన్ విలువకు మూడింతలు చేసి ఇవ్వాలి.
1899 భారత స్టాంపుల చట్టం ప్రకారం సేకరించ తలపెట్టిన భూమి ఉన్న ప్రాంతానికి సమీప గ్రామం లేదా సమీప ప్రాంతంలోని అదే తరహా అమ్మకాల సగటు విలువను అంచనా వేసి ధర నిర్ధారిస్తారు.
పై రెండు నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుతం ముంపు గ్రామాల్లో కొన్ని భూములకు రూ. 60 వేలు, ఇంకొన్ని భూములకు రూ. 90 వేల చొప్పున రిజిస్ట్రేషన్ ధర ఉంది. గరిష్టంగా రూ. 90 వేలను ప్రామాణికంగా తీసుకొని భూముల విలువ లెక్కగడితే ఎకరానికి రూ.2.70 లక్షలకు మించి రావు.
మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటే నీటి సౌకర్యాన్ని బట్టి రైతుకు ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు భూ క్రయవిక్రయాలు చేసుకున్నారు. కానీ ఏ ఒక్క రైతు కూడా రూ.12 లక్షలకు భూములు కొన్నట్టు, అమ్మినట్టు దస్తావేజుల్లో రాసుకోలేదు. అందరూ సాధారణ రిజిస్ట్రేషన్ ధరనే చూపించి భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ లెక్కన కూడా బాధితులకు నష్టపరిహారం పెంచేందుకు ఆధారాలు దొరకడం లేదు.
ఐఏవై పథకంలోని నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని ఉంది. ఐఏవై కింద అంటే 80 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.75 వేలు ఇస్తారు. ఈ మొత్తాన్ని బేస్‌మెంటు, గోడల నిర్మాణం, స్లాబ్ సమయాల్లో అందజేస్తారు.
బాధితులకు నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వానికి 6 నుంచి 8 నెలల సమయం తీసుకునే వెసులుబాటు ఈ చట్టంలో ఉంది. గతంలో సింగూరు ప్రాజెక్టు కింద పుల్కల్, అందోల్ మండలాల్లోని 24 గ్రామాల్లో రైతులు భూములు కోల్పోయారు. కానీ రైతులకు చేతికి ఇప్పటికీ డబ్బులు రాలేదు. భూములు కోల్పోయిన వాళ్లంతా నష్టపరిహారం కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.

123 ఉత్తర్వుల ప్రకారం పరిహారం ఇలా..
123 జీఓ.. రైతు ఒప్పుకుంటేనే వారితో ప్రభుత్వం ఒప్పందం చేసుకునే జీఓ ఇది. దీని ప్రకారం ఎకరానికి రూ. 6 లక్షలను ప్రభుత్వం ఇవ్వజూపుతోంది.
బోరు, చెట్టు, బావి, పైపులైన్లు ఇలా ఏమి ఉంటే వాటికి కూడా అదనంగా నష్టపరిహారం కట్టిస్తారు. ఈ లెక్కన.. సగటున ఒక్కో ఎకరానికి రూ.7 లక్షల నుంచి రూ. 7.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందుతుంది. ఈ డబ్బు కూడా రైతులు భూములు రిజిస్ట్రేషన్ చేసిన 15 నుంచి 20 రోజుల్లోనే చేతికందుతుంది.
ఇళ్లు కోల్పోతున్న వారికి రూ.5.4 లక్షల నష్టపరిహారం (డబుల్ బెడ్‌రూమ్ ఇంటికయ్యే ఖర్చు)తో పాటు, కొత్త ఇళ్లు కట్టుకోవడానికి మరో రూ.5.4 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తారు.

 ప్రభుత్వం అదనంగా ఇచ్చిన హామీలు..
ముంపు గ్రామాలకు మత్స్యకార సొసైటీ ఏర్పాటు చేసి రిజర్వాయర్ చేపలపై వచ్చే ఆదాయం పూర్తిగా ఆ కుటుంబాలకే దక్కే విధంగా చట్టం చేసి హక్కులు కల్పిస్తుంది.
మునిగిపోతున్న పాత ఇళ్లకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విలువ (రూ.5.4 లక్షలు) నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఇంటి ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలానికి అదనపు ధర చెల్లిస్తుంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ పథకాల్లో దాదాపు 50 శాతం ముంపు గ్రామాల కుటుంబాలకే ఇవ్వనుంది.
సాదా కాగితం మీద కొన్న వాళ్లకు కూడా సాదాబైనామా అమలు చేసి ఇస్తారు.
ఎస్సీ, ఎస్టీ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ముంపు గ్రామాల పిల్లలకు సీట్లిచ్చి ఉచిత విద్య అందిస్తారు.
భూములు లేని నిరుపేద యువతకు ఉపాధి కోసం దశల వారీగా సబ్సిడీపై ఆటోలు, ట్రాక్టర్లు అందిస్తారు.
ఊరిని పోలిన ఊరు ప్రభుత్వమే కట్టిస్తుంది. 200 గజాల ఇళ్ల స్థలాలు కేటాయించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తుంది.
పట్టాభూములతో సమానంగాలావణి  పట్టా, అసైన్డ్ భూములకూ ధర చెల్లిస్తారు.
నష్టపరిహారం విడతల వారీగా కాక ఒకేసారిగా చేతికి ఇస్తారు.
కొత్త ఊరు, కొత్త ఇళ్లు కట్టించే వరకు పాత ఇళ్లను ఖాళీ చేయించరు. 

మరిన్ని వార్తలు