బతుకునిచ్చినవాడు భారమయ్యాడు

6 Jul, 2017 03:34 IST|Sakshi
బతుకునిచ్చినవాడు భారమయ్యాడు
ఉపయోగం లేదని భావించి తండ్రిని వదిలించుకున్న తనయులు
మురుగుగుంట వద్ద వదలివెళ్లిన వైనం
అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్న సోదరుడు

 
తాళ్లరేవు (ముమ్మిడివరం) : కన్నతండ్రి బిడ్డలకు బరువయ్యాడు. తండ్రి వల్ల పైసా ఉపయోగం లేదనుకున్న ఆ కుమారులు ఆయనను రోడ్డున పడేసారు. ప్రమాదంలో కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధ తండ్రిని ఏ మాత్రం కనికరంలేకుండా ఒక మురికిగుంట వద్ద పడవేసిన ఘటన స్థానికులను కలిచివేస్తుంది. తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామానికి చెందిన కొల్లాటి తాతారావు చేపల వేట ఆధారంగా జీవించేవాడు. అతనికి భార్య ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలందరికీ పెళ్లిళ్లై వేరే ప్రాంతాల్లో స్థిరపడ్డారు. భార్యాభర్తల మధ్య తగాదాలు రావడంతో చాలా ఏళ్ల క్రితమే అతని భార్య ధవళేశ్వరంలోని కుమారుడి వద్దకు వెళ్లిపోయింది. గ్రామంలో ఒంటరిగా ఉండలేక కాకినాడలో ఉంటున్న మరో కుమారుడి వద్దకు గతంలో వెళ్లిపోయినట్లు తాతారావు చెపుతున్నాడు. ఇలా ఉండగా ఇటీవల డ్రెయినేజీలో పడిపోవడంతో కాలు విరిగిపోయింది.

ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేసినప్పటికీ కాలు పనిచేయకపోవడంతో లేవలేని స్థితిలో ఉన్న అతన్ని నీలపల్లి తీసుకువచ్చి వదిలి వెళ్లారు. తాతారావుకు చెందిన స్థలంలో ఉన్న మురికిగుంట పక్కనే కొబ్బరి ఆకులతో చిన్న పందిరి వేసి అక్కడ వదిలి చేతులు దులుపుకొన్నారు. తాతారావు సోదరుడు నూకరాజు అక్కడే నివసిస్తుండడంతో సమయానికి తిండి పెడుతుండడంతో ఎలాగోలా జీవితం సాగిస్తున్నాడు. గతంలో దర్జాగా బ్రతికిన తాతారావు ప్రస్తుత పరిస్థితి చూసి స్థానికులు చలించిపోతున్నారు. స్థానిక సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నాయకురాలు రేవు మల్లేశ్వరి, వైఎస్సార్‌సీపీ నీలపల్లి గ్రామ కమిటీ కన్వీనర్‌ కట్టా దుర్గారావులు అతన్ని పరామర్శించి వివరాలు తెలుసుకుని ఆర్థిక సాయం అందజేశారు. 
 
పురుగులమందు తాగి చచ్చిపోవాలని ఉంది..
కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన పిల్లలూ పట్టించుకోకపోవడంతో ఏదైనా పురుగుల మందు తాగి చచ్చిపోవాలని ఉందని తాతారావు విలపిస్తున్నాడు. ఎక్కడికైనా వెళ్లి పనిచేసుకుందామన్నా కాలు సహకరించడంలేదని, తనకుగల రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు అన్నీ అగ్నిప్రమాదంలో కాలిబూడిదయ్యాయని వాపోయాడు. 
 
ప్రభుత్వం ఆదుకోవాలి 
అవసాన దశలో కష్టాలు పడుతున్న తాతారావును ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక సర్పంచ్‌ రేవు మల్లేశ్వరి డిమాండ్‌ చేశారు. ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్న అతనికి ప్రభుత్వం పింఛన్‌ మంజూరు చేయాలని కోరుతున్నారు. అతని పరిస్థితి చూసి చలించిన ఒక దాత షెడ్డు నిర్మించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు.
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా