సో.. ’స్వీట్‌’

19 Aug, 2017 00:52 IST|Sakshi
సో.. ’స్వీట్‌’
ఆదాయాన్నిస్తున్న తేనెటీగల పెంపకం 
ఆసక్తి చూపుతున్న రైతులు 
కేవీకేలో నేడు ప్రపంచ తేనెటీగల దినోత్సవం
తాడేపల్లిగూడెం : 
తేనెటీగల పెంపకం రైతులకు ఆదాయాల తీపిని పంచుతోంది. గిరిజన ఉప ప్రణాళిక కింద వీటి పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఉద్యానశాఖ ద్వారా తేనెటీగల పెంపకానికి 50 శాతం రాయితీతో పెట్టెలను అందిస్తున్నారు. శనివారం ప్రపంచ తేనెటీగల దినోత్సవం నేపథ్యంలో వీటి పెంపకం, స్థితిగతులపై ఈ ప్రత్యేక కథనం. 
రైతుకు ఆదాయం చేకూర్చడంతో పాటు అదనపు ఉపాధి కలగడానికి తేనెటీగల పెంపకం ఉపకరిస్తుంది. మొక్కలలో పరపరాగ సంపర్కం తేనెటీగల ద్వారా జరగడం వల్ల వ్యవసాయం, ఉద్యాన పంటలలో దిగుబడులు పెరిగినట్టు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. జిల్లాలో గిరిజన ఉప ప్రణాళిక కింద  ఆర్‌కెవీవై పథకంలో 300 మంది గిరిజనులకు జీలుగుమిల్లి, బుట్టాయగూడెం ప్రాంతంలో తేనె టీగల పెంపకంపై శిక్షణ ఇచ్చారు. గిరిధార ప్రొడ్యూసర్స్‌ సొసైటీ కింద వీరు ఏర్పాటై తేనెను తయారు చేస్తున్నారు. కిలో 300 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఉద్యాన శాఖ ద్వారా వీటి పెంపకానికి ఒక్కొక్క రైతుకు ఎనిమిది బాక్సుల వంతున 50 శాతం రాయితీపై ఇస్తున్నారు. 
తేనెటీగలను బాధ పెట్టకుండా.. 
తేనెటీగలను దులపక్కర్లేదు. వాటిగుడ్లను పాడు చేయనక్కర్లేకుండానే చక్కని తేనెను తీసుకోవచ్చు. పాత తేనె సేకరణ ప్రక్రియకు మెరుగులు దిద్దుతూ ఆస్ట్రేలియా దేశంలో ఫ్లో...హనీ యంత్రాలు తయారయ్యాయి. ఈ ప్రక్రియలో కూలీ ఈగలు, రాణి ఈగలను బాధపెట్టక్కర్లేకుండానే తేనెను తీసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.  ఫ్లో హనీలో కింద అరలో తేనెను తయారు చేసే కూలీ ఈగలు ఉంటాయి. ఇవి ఇదే యంత్రంలో పైన అమర్చిన హనీ ఎక్స్‌ట్రాక్టర్‌లో తేనెను నింపుతాయి. తేనె ఆ అరలో నిండిన తర్వాత పైన మైనపు పూతలను కూలీ ఈగలే వేస్తాయి. పై అరలో తేనె నిండిన వెంటనే ఫ్లో హనీ యంత్రంలో ఉన్న ఇండికేటర్స్‌లో యంత్రంలో తేనె నిండినట్టుగా సంకేతాలు కనిపిస్తాయి. దీంతో పై అరలో ఉన్న మైనపు పూతతో కూడిన తెట్టును నెమ్మదిగా టచ్‌ చేస్తే ఆ యంత్రానికి అమర్చిన కుళాయి ద్వారా శుద్ధ తేనె వస్తుంది. తేనె సేకరణలో సాధారణ ప్రక్రియలో కూలీ ఈగలు పుప్పొడిని, మకరందాన్ని తీసుకొచ్చి తేనెటీగల బాక్స్‌లో గుడ్లను పెట్టి మైనపు తెట్టుగా తయారు చేస్తాయి. తేనె తయారైందని తెలిసిన తర్వాత పట్టుగూడుకున్న ఈగలను దులిపి మైనపు ముద్దలాంటి పట్టును ఎక్స్‌ట్రాక్టర్‌లో తిప్పితే గాని తేనె బయటకు రాదు. ఈ ప్రక్రియలో తేనె గుడ్లు పాడవ్వటంతో పాటు ఈగలు, పెద్ద సంఖ్యలో చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రక్రియకు మెరుగులు దిద్ది ఫ్లో హనీని రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది ఇలా ఉండగా స్థానిక వెంకట్రామన్నగూడెం కృషి విజ్ఞానకేంద్రంలో శనివారం ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని జరపనున్నారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ చిరంజీవి చౌదరి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.   
 
మరిన్ని వార్తలు