జిల్లాలో త్వరలో 50 పాఠశాలల్లో డిజిటల్‌ విద్యా బోధన

8 Aug, 2016 17:13 IST|Sakshi
పైడిపాల(మాకవరపాలెం) : డిజిటల్‌ బోధనతో విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంపొందుతుందని డిప్యూటీ డీఈవో సి.వి.రేణుక పేర్కొన్నారు. జిల్లాలో 50 పాఠశాలల్లో త్వరలో డిజిటల్‌ బోధనకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిపారు. మండలంలోని పైడిపాల ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కె.ఎస్‌.ఆర్‌.మూర్తి, తన సొంత నిధులతో ఎల్‌సీడీ ప్రొజెక్టర్, స్క్రీన్‌ కొనుగోలు చే యగా, దానిని సోమవారం ఆమె ప్రారంభించారు.  ప్రాథమిక స్థాయి నుంచీ విద్యార్థులకు డిజిటల్‌ విద్యా బోధన చేయాలని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న మూర్తిని అభినందించారు. మిగిలినవారు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ ఏర్పాటు ఏయడం ఇదే ప్రథమమన్నారు. దీంతోపాటు నెక్‌ బ్యాండ్‌ పీఏ సిస్టమ్‌ విత్‌ డిజిటల్‌ ప్లేయర్‌ను కూడా కొనుగోలు చేసిన మూర్తి విద్యార్థులందరికీ వినబడేలా, అర్థమయ్యేలా బోధన అందించడం ద్వారా విద్యాభివద్ధికి ఆయన  చేస్తున్న కషి హర్షణీయమని రేణుక కొనియాడారు.
జిల్లాలో 50 పాఠశాలల్లో త్వరలో డిజిటల్‌ బోధనకు సన్నాహాలు జరుగుతున్నట్లు రేణుక తెలిపారు. రాజీవ్‌ విద్యా మిషన్‌ నిధులతో ఒక్కో పాఠశాలలో ఐదు తరగతి గదుల్లో డిజిటల్‌ బోధన చేపట్టనున్నట్టు చెప్పారు. గతేడాది 80 మంది విద్యార్థులున్న 221 పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా మార్పుచేశామన్నారు. మూడో విడతగా మంజూరైన అదనపు భవనాల నిర్మాణాలకు త్వరలో నిధులు విడుదల కానున్నట్లు తెలిపారు. కిలోమీటరులోపు 10 కంటే తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేసి సమీప పాఠశాలల్లో విలీనం చేస్తామన్నారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్‌ రుత్తల రాజు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 
 
 
>
మరిన్ని వార్తలు