మారుమోగిన ఈరన్న నామస్మరణ

16 Aug, 2016 00:43 IST|Sakshi
మారుమోగిన ఈరన్న నామస్మరణ
– భక్తులతో పోటెత్తిన ఉరుకుంద క్షేత్రం
– తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు
– దర్శనానికి నాలుగు గంటల నిరీక్షణ
  
కౌతాళం: శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా రెండో సోమవారం ఉరుకుంద క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాల్లో ఎటు చూసిన భక్తులే కనిపించారు. క్షేత్రం ఈరన్న నామస్మరణతో మారుమోగింది. దారులన్నీ ఉరుకుంద క్షేత్రం వైపే అన్నట్లు వేల సంఖ్యలో వాహనాలు చేరుకున్నాయి. లక్షాలాదిగా తరలివచ్చిన భక్తులు తమ ఇలవేల్పును దర్శించుకుని, నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.  మూడు లక్షలకు పైగా భక్తులు తరలిరావడంతో ఆదివారం రాత్రి నుంచి నిరంతరం దర్శనం కల్పిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో అరగంట మాత్రమే విరామం కల్పించి సుప్రభాతసేవ, మహా మంగళహారతి, పంచామతాభిషేకం, ప్రత్యేక పూజల అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. రద్దీ అధికంగా ఉండటంతో స్వామి వారి దర్శనానికి నాలుగు గంటలకుపైగా వేచి చూడాల్సి వచ్చింది. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం, వీఐపీ దర్శనాలను ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి వారి మొక్కుబడిగా తలనీలాలు సమర్పించారు. అనంతరం తుంగభద్ర కాలువలో పుణ్యస్నానాలు చేసి స్వామిని దర్శించుకున్నారు. ఎక్కడ స్థలం దొరికితే అక్కడే సేద తీర్చుకోని వంటలు వండడం కనిపించింది. ఉరుకుందకు వచ్చే నాల్గు రూట్లన్ని భక్తులతో కిలోమీటర్‌ వరకు నిండిపోయాయి. ఆదోని డిపో నుంచి 50 బస్సులు, ఎమ్మిగనూరు డిపో నుంచి 30 బస్సులు, కర్ణాటకలోని శిరుగుప్ప నుంచి 15 బస్సులు, బళ్లారి నుంచి 5 బస్సులను, రాయచూరు డిపో నుంచి 10 బస్సులను నడిపి భక్తులకు సహకరించారు. ఆదోని తాలుకా సీఐ దైవప్రసాద్‌ ఆధ్వర్యంలో కౌతాళంలో ఎస్‌ఐ నల్లప్పతో పాటు మరో నలుగురు ఎస్‌ఐలు ఏఎసై ్సలు, హెడ్‌కానిస్టేబుల్, 10 మంది మహిళా కానిస్టేబుళ్లతో పాటు వాలంటీర్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు.  
 
మరిన్ని వార్తలు