'నిర్లక్ష్యంగా ఉంటే వారిపైనా చర్యలు తప్పవు'

29 Feb, 2016 20:34 IST|Sakshi

కరీంనగర్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువతి అత్యాచార ఘటనలో పోలీసుల నిర్లక్షం ఉంటే వారిపైనా కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిస్ స్ఫష్టం చేశారు. బాధితురాలు సోమవారం ఎస్పీని కలిసిన నేపధ్యంలో న్యాయం చేస్తామని ఆమెకు హామీ ఇచ్చారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం వారి పదో తరగతి సర్టిఫికెట్లను పరిశీలించి వయసు నిర్థారణ చేశామని, నిందితుల్లో ఒకరికి17 సంవత్సరాల 9నెలలు, మరొకరికి 17ఏళ్ల 7నెలలుగా తేలిందన్నారు. వయసు నిర్థారణకై పదో తరగతి మెమోతోపాటు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు.

విచారణకు స్పెషల్ టీంను ఏర్పాటు చేశామని, త్వరలోనే ఛార్జిషీటు దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్షం ఉందని తేలితే వారికి కూడా చర్యలు తప్పవని ఎస్పీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు