అక్రమార్కుల భరతం పడతా..

27 Jun, 2017 11:31 IST|Sakshi
అక్రమార్కుల భరతం పడతా..

► ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణా అంతు చూస్తా
► పోలీస్, ప్రజల మధ్య అంతరాన్ని తొలగిస్తా
► ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ    


నెల్లూరు సిటీ: ‘అక్రమార్కుల భరతం పడతా. ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడతా. పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేస్తా’నని జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పీహెచ్‌డీ రామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన విధుల్లో చేరారు. ముందుగా తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరు పోలీస్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు బాధ్యతలు చేపట్టారు. ఏఎస్పీ శరత్‌బాబు, ఏఆర్‌ ఏఎస్పీ సూరిబాబు, ఎస్‌బీ డీఎస్పీ కోటారెడ్డి, నగర డీఎస్పీ వెంకట రాముడు, రూరల్‌ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, పలువురు డీఎస్పీలు, సీఐలు రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణా పెద్దఎత్తున సాగుతున్నట్టు తన దృష్టికివచ్చిందని, వీటిపై ప్రత్యేక దృష్టి సారించి అక్రమ రవాణాకు అడ్డకట్ట వేస్తానని ఎస్పీ చెప్పారు. ప్రతి సోమవారం నిర్వహించే ‘గ్రీవెన్స్‌ డే’ సందర్భంలో జిల్లాలోని ప్రతి పోలీసు అధికారి ప్రధాన కేంద్రంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అవసరమైతే గురువారం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మంచి చరిత్ర కలిగిన నెల్లూరు జిల్లాకు ఎస్పీగా రావడం సంతోషంగా ఉందన్నారు.

ప్రజలు, పోలీసుల మధ్య అంతరాన్ని తొలగించేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపారు. అవినీతిపరులపై ప్రత్యేక దృష్టి సారించి సరిచేస్తానని హామీ ఇచ్చారు. నెల్లూరులో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉందని, త్వరలోనే దీనిని క్రమబద్ధీకరిస్తానన్నారు. ట్రాఫిక్‌ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేస్తానని తెలిపారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ నెలకొల్పుతామన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తనను ఫోన్‌లో సంప్రదించవచ్చని తెలిపారు. ఫోన్‌ ద్వారా 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.

మరిన్ని వార్తలు