కర్నూలులో రెడ్ అలర్ట్

4 Jul, 2016 11:41 IST|Sakshi

రద్దీ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు
రంగంలోకి దిగిన బాంబ్, డాగ్‌స్క్వాడ్ బృందాలు
ఎస్పీ నగరంలో విస్తృత పర్యటన

కర్నూలు: ఉగ్రవాదుల కదలికలపై జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా అంతటా సోదాలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఐసిస్ సానుభూతి పరులు అనుమానిత ఉగ్రవాదులు, పొరుగు జిల్లా అనంతపురంలోని ఓ లాడ్జీలో మూడు రోజుల పాటు విడిది చేసినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదివారం జిల్లా అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించి అన్ని సబ్‌డివిజన్ అధికారులను అప్రమత్తం చేశారు.

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా థియేటర్లు, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ కొత్త వ్యక్తులపై నిఘాను ఏర్పాటు చేయాలని డీఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. రాయలసీమ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలంటే కర్నూలు ముఖద్వారం అటు బెంగళూరు, ఇటు హైదరాబాద్, విజయవాడకు కర్నూలు నుంచి రహదారులు అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐసీస్ సానుభూతిపరులు జిల్లాలో కూడా ప్రవేశించే ప్రమాదం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరిక మేరకు తనిఖీలు ముమ్మరం చేశారు.
 
కర్నూలును జల్లెడ పట్టిన పోలీసులు:

 ఎస్పీ ఆకె రవికృష్ణ నాయకత్వంలో పోలీసులు కర్నూలును జల్లెడ పట్టారు. నగరంలోని ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో ముఖ్యమైన కూడళ్లలో వాహనాలను తనిఖీ చేస్తూ నాకా బందీ నిర్వహించారు. ఎస్పీ, ఆకె రవికృష్ణతో పాటు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 20 మంది ఎస్‌ఐలు, వందలాది మంది సాయుధ బలగాలను వెంటబెట్టుకొని దాదాపు రెండు గంటల పాటు ఎస్పీ నగరమంతా కలియదిరిగి సోదాలు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఓఎస్‌డీ రవిప్రకాష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, డీఎస్పీలు రమణమూర్తి, రామచంద్ర తదితరులు ఎస్పీవెంట ఉన్నారు.
 
రాజ్‌విహార్, మౌర్యాఇన్ సర్కిల్, శ్రీకృష్ణదేవరాయ సర్కిల్, కొత్తబస్టాండు, జ్యోతిమాల్, గుత్తి పెట్రోల్‌బంకు, జొహరాపురం, సుంకేసుల రోడ్డు, కోడుమూరు రోడ్డులోని వైజంక్షన్, వెంకటరమణ కాలనీ, నంద్యాల చెక్‌పోస్టు, కలెక్టరేట్, పాతబస్తీలోని రసూల్ ఖాన్ బజారు, చౌక్ బజారు, పెద్దమార్కెట్ ప్రాంతాల్లో ముమ్మరంగా వాహనాలు, వ్యాపార దుకాణాలు సోదాలు నిర్వహించారు. స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు బాంబ్ స్వ్కాడ్, డాగ్‌స్వ్కాడ్ బృందాలు వెంటబెట్టుకొని పోలీసులు సోదాలు నిర్వహించడంతో ఏమి జరిగిందోనని నగర ప్రజలు ఆదోళనకు గురయ్యారు. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఏకకాలంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు.
 
 లాడ్జీల్లో ముమ్మర సోదాలు
 నగరంలోని ప్రధాన లాడ్జీలతో పాటు వ్యాపార దుకాణాలు, షాపింగ్ మాల్స్‌లో బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. జిల్లా పరిషత్‌కు ఎదురుగా ఉన్న జ్యోతి మాల్‌లో అడుగడుగునా తనిఖీలు నిర్వహించి నిర్వాహకులను అప్రమత్తం చేశారు. లాడ్జీలో గది కేటాయించే క్రమంలో విడిది చేసే వ్యక్తి గుర్తింపు కార్డు నకలు తప్పని సరిగా తీసుకోవాలని, రిసెప్షన్ కౌంటర్‌లో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు ఆదేశించారు. అపరిచిత వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇవ్వరాదని, కొత్తగా అద్దెకు వచ్చిన వారి గుర్తింపు కార్డులు, పూర్తి సమాచారం ఇంటి యజమానులు తప్పనిసరిగా సేకరించి ఉండాలని, కాలనీ వాసులను హెచ్చరించారు.

మరిన్ని వార్తలు