నేరాలకు అడ్డుకట్ట వేశాం

28 Dec, 2016 22:42 IST|Sakshi

– గతంతో పోలిస్తే ఘననీయంగా తగ్గిన నేరాలు
– వందశాతం నేరాలు, ప్రమాదాలు అరికట్టడం అసాధ్యం
– 2016 సమీక్షలో ఎస్పీ రాజశేఖరబాబు వెల్లడి


అనంతపురం సెంట్రల్‌ : గతంలో పోలిస్తే నేరాలు ఘననీయంగా తగ్గాయని ఎస్పీ రాజశేఖరబాబు తెలిపారు. జిల్లాకు చెడ్డపేరు తెస్తున్న ఫ్యాక‌్షన్‌ ఘటనలు చోటు చేసుకోకుండా సమర్థంగా చర్యలు చేపట్టామని వివరించారు. సాంకేతికతను అందిపుచ్చుకొని జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, దొంగతనాలు ఛేదింపు వంటి బృహత్తర కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. 100 శాతం రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు నిర్మూలించడం సాధ్యం కాదన్నారు. బుధవారం పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాలులో 2016లో నేరాలు– పోలీసుల పనితీరుపై విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు.

జిల్లా వ్యాప్తంగా గతేడాది 6,860 కేసులు నమోదయ్యాయి. ఇందులో లబ్ధి కోసం 4 హత్యలు, 3 దోపీడీలు, 12 రాబరీలు, 242 బగ్లరీస్‌, 479 సాధారణ దొంగతనాలు, 117 హత్యలు, 99 దాడులు, 69 కిడ్నాపులు, 33 అత్యాచారాలు, 186 హత్యాయత్నాలు, 1,394 రోడ్డు ప్రమాదాల కేసులు నమోదయ్యాయని వివరించారు. వీటిలో 637 మంది మృతి చెందగా 2,084 మంది గాయపడ్డారని తెలిపారు. గతంతో పోలీస్తే వీటి సంఖ్య చాలా తక్కువన్నారు.

నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా దొంగతనాలు బాగా తగ్గాయన్నారు. చోరీల సొమ్ములో రూ.2.50 కోట్లు విలువైన ఆభరణాలు, నగదు రీకవరీ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. జిల్లా గుండా అక్రమంగా రవాణా చేసే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడిందన్నారు. మోటార్‌ వెహికల్‌ చట్టం ద్వారా 2,37,768 కేసులు నమోదు చేసి రూ.3.90 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా, ఇసుక మాఫియాలపై 103 కేసులు నమోదు చేసి 118 ట్రాక్టర్లు, 41 లారీలు, 11 జేసీబీలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

కుటుంబ కలహాలు, పేదరికం, అప్పులు, ప్రేమ విఫలం తదితర కారణాలతో 751 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. నేరస్తుల్లో పరివర్తన కోసం ఒక దొంగ– ఒక పోలీస్‌ కార్యక్రమాన్ని వినూత్నంగా ఆలోచించి అమలు చేస్తున్నట్లు చెప్పారు. పోలీస్‌శాఖకే తలమానికంగా అధునాతన హంగులతో పోలీస్‌కల్యాణమండపం నిర్మించామన్నారు. రాబోయే సంవత్సరంలో మహిళా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు.

మరిన్ని వార్తలు