ఫ్యాక్షన్, రౌడీయిజంపై ఉక్కుపాదం

26 Jul, 2016 23:52 IST|Sakshi

 ఏ చిన్న ఘటన జరిగినా సహించేది లేదు
 పోలీసులకు డీఐజీ, ఎస్పీ హెచ్చరిక


అనంతపురం సెంట్రల్‌: జిల్లాలో ఫ్యాక్షన్, రౌడీయిజాన్ని పూర్తి స్థాయిలో అణచివేయాలని అనంతపురం రేంజ్‌ డీఐజీ ప్రభాకర్‌రావు ఆదేశించారు. అనంతపపురం రుద్రంపేటలో ఇటీవల జరిగిన జంట హత్యల నేపథ్యంలో ఎస్పీ రాజశేఖరబాబుతో కలసి స్థానిక పోలీస్‌కాన్ఫరెన్స్‌ హాల్‌లో అనంతపురం సబ్‌డివిజన్‌ పోలీస్‌ అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఏ చిన్న ఘటన జరిగినా సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సబ్‌ డివిజన్‌లోని ఫ్యాక్షనిస్టుల గురించి ఆరా తీశారు. ఫ్యాక్షన్‌ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఫ్యాక్షనిస్టులు, వారి అనుచరులపై నిత్యం నిఘా ఉంచాలన్నారు.


పోలీసు అధికారులు, సిబ్బందిని తరచూ అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారాన్ని సేకరించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫ్యాక్షన్‌ ప్రాంతాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ నిబద్ధతతో పని చేయాలని చెప్పారు. సమాజంలో అరాచకాలు సృష్టించే వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రధానంగా రౌడీయిజం జిల్లాలో ఎక్కడా కన్పించరాదన్నారు. ప్రశాంతతకు భంగం కలిగించే రౌడీషీటర్లను స్టేషన్లకు పలిపించి తీవ్రంగా హెచ్చరించాలని సూచించారు. భూ కబ్జాదారులపై నిఘా వేయాలని, బైండోవర్లు, కౌన్సెలింగ్‌లు చేపట్టాలన్నారు. రక్షక్, బ్లూకోట్స్‌ సహా టెక్నాలజీని ఉపయోగించి కేసుల్లో పురోగతి సాధించాలని సూచించారు. అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ, స్పెషల్‌బ్రాంచ్‌ డీఎస్పీ గంగయ్య, డివిజన్‌ పరిధిలోని సీఐలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు