ఉద్యోగులపై ‘మూడో’ కన్ను

20 Aug, 2015 01:08 IST|Sakshi
ఉద్యోగులపై ‘మూడో’ కన్ను

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల పనితీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నిఘా పెట్టింది. తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినప్పటికీ పరి పాలనలో ఒడిదుడుకులు ఇంకా అధిగమించలేదనే అభిప్రాయానికి వచ్చింది. ప్రధానంగా పాలనకు గుండెకాయలాంటి సచివాలయంలో అధికారులు, ఉద్యోగుల పనితీరుపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. ఇటీవలే అన్ని విభాగాల పనితీరుపై ముఖ్యమంత్రి కార్యాలయం అంతర్గతంగా సర్వే చేయించింది. పలు కార్యాలయాలకు వచ్చే ప్రజలు, అర్జీదారులకు ఎదురవుతున్న ఇబ్బందులు, అక్కడి ఉద్యోగులు స్పంది స్తున్న తీరును రహస్యంగా తెలుసుకుంది.

తమది ‘ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సందర్భం వచ్చినప్పుడల్లా పలుమార్లు ప్రస్తావించటం తెలిసిందే. కానీ.. ఈ సర్వేలో పలు ఆందోళనకర అంశాలు దృష్టికి రావటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధానంగా విధి నిర్వహణలో ఉద్యోగులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని.. రెవెన్యూ, మున్సిపల్, హౌసింగ్ విభాగాలతో పాటు సచివాలయం కేంద్రంగా అవినీతి వ్యవస్థీకృతమైందని సర్వేలో తేలింది. ఇరిగేషన్ విభాగంతో పాటు పలు విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులను బేరం పెట్టి దళారులు లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. ఈ దందాల్లో తెర వెనుక ఇక్కడి ఉద్యోగుల ప్రమేయం ఉందన్న ఆరోపణలున్నాయి.
 
 ఉద్యోగుల్లో ఏదీ నాటి స్ఫూర్తి
 ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఎక్కువ గంటలు పని చేస్తామని, ఎక్కువ శ్రమిస్తామని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు వివిధ సంఘాలుగా ఏర్పడి ఒక్కతాటిపై నిలబడ్డారు. అదే స్ఫూర్తిని రగిలించేందుకు కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన నిలబడింది. అడిగిందల్లా కాదనకుండా.. తెలంగాణ ఇంక్రిమెంట్‌తోపాటు 43 శాతం ఫిట్‌మెంట్‌తో పదో పీఆర్‌సీ సిఫారసులను అమలు చేసింది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో వ్యవహరించిన తరహాలోనే అదే ఆనవాయితీని ఉద్యోగులు కొనసాగిస్తున్నారని.. అర్జీలను పట్టించుకోవటం లేదని, మంత్రులు, ప్రముఖుల సిఫారసుల ఫైళ్లను మాత్రమే చకచకా కదిలిస్తూ మిగతా వాటిని పక్కన పడేస్తున్నారని గుర్తించింది. దీంతో కొన్ని విభాగాల్లో ఉద్యోగులకు స్థానచలనం కల్పించటం ద్వారా ఈ రుగ్మతలను పారదోలవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో పని చేసిన సిబ్బంది కొన్ని విభాగాల్లో ఏళ్లకేళ్లుగా పాతుకుపోయారు. వీరిని ఇతర విభాగాలకు సర్దుబాటు చేయాలని, సెక్రెటేరియట్‌లో పని చేస్తున్న ఉద్యోగులను అవసరమైతే జిల్లాలకు పంపించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుత ం ఉన్న సెక్రెటేరియట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఇక్కడి ఉద్యోగులను జిల్లాలకు పంపించటం కుదరదు. అయితే వారిని జిల్లాలకు పంపేందుకు అవసరమైతే సర్వీస్ రూల్స్‌ను సరళీకృతం చేయాలని సీఎం ఉన్నతాధికారులను సూచించినట్లు తెలిసింది.

 అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు..
 అవినీతి రహిత పాలనతో పాటు పారదర్శకంగా వీలైనంత వేగంగా ప్రజలకు సేవలందించాలనేది బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలక లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది. పది నెలల కిందటే అవినీతిని సహించేది లేదని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్ని విభాగాలకు సీఎం హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా నేరుగా ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. మొదటి వారంలోనే వేలాదిగా ఫిర్యాదులు వెల్లువెత్తటంతో వాటిని ఆయా విభాగాలకు పంపించటం తప్ప.. సీఎంవో కార్యాలయం వీటిపై చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. దీంతో అక్కడ ఫిర్యాదు చేసినా.. అంతే సంగతులనే ప్రచారం జరిగింది. ఫలితంగా కాల్‌సెంటర్‌కు వచ్చే రోజువారీ ఫిర్యాదుల సంఖ్య వేళ్లపై లెక్కించే స్థాయికి పడిపోయింది.

తాజా సర్వేతో అందిన సమాచారంతో ఇకపై అవినీతి ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు సచివాలయ ఉద్యోగులు, అధికారుల వేళలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆరంభంలో స్వయంగా మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఉద్యోగులు సమయపాలన పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు. అదే తరహాలో ఉన్నతాధికారులు, మంత్రుల సారథ్యంలో అడపాదడపా తనిఖీలు కొనసాగించే ఆలోచనలు చేస్తోంది.
 

మరిన్ని వార్తలు