దివ్యాంగుల భద్రతకు ప్రత్యేక చర్యలు

8 May, 2017 22:15 IST|Sakshi
దివ్యాంగుల భద్రతకు ప్రత్యేక చర్యలు
– తెలుగులో అనువదించిన దివ్యాంగుల చట్టం–2016 పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎస్పీ 
కర్నూలు: దివ్యాంగుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. సోమవారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో దివ్యాంగుల జేఏసీ సభ్యులు ఎస్పీని కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దివ్యాంగుల చట్టం–2016 తెలుగు అనువాద పుస్తకాన్ని దివ్యాంగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల జేఏసీ నాయకులు మధుబాబు, గోపాల్, అభిలాష్, వినోద్, లీలప్ప తదితరులు మాట్లాడుతూ.. తమకు రక్షణ కల్పించి కించపరిచేలా మాట్లాడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కృషి చేయాలని ఎస్పీని కోరారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ దివ్యాంగుల చట్టం–2016 పుస్తకాన్ని జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపిస్తానని, దివ్యాంగులకు భద్రత కల్పించేలా సిబ్బందికి సూచనలిస్తామని హామీ ఇచ్చారు. 
దివ్యాంగుల చట్టం–2016లో వారి రక్షణకు పొందుపరచిన కొన్ని ముఖ్యాంశాలు... 
  •  సెక్షన్‌ 92 ప్రకారం వికలాంగులను కించపరచినా, అవమానించినా, భయపెట్టినా, మాన మర్యాదలు భంగపరచినా, పెత్తనం చేసినా, లైంగిక దాడి చేసినా, లైంగికంగా వాడుకున్నా, గాయపరచినా, భావజాలంపై దాడి చేసినా, సహాయ పరికరాన్ని ధ్వంసం చేసినా ఆరు నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష. 
  • సెక్షన్‌ 7/4 ఎ, బి, సి, డి ప్రకారం వికలాంగులపై వేధింపులు, హింస, దోపిడీ, ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే చట్టప్రకారం తీసుకునే బాధ్యతల నుంచి పోలీసు అధికారి తప్పించుకునే అవకాశం లేదు.
  • సెక్షన్‌ 20/5 ప్రకారం కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న వికలాంగులకు న్యాయం, హక్కుల కోసం ప్రభుత్వం అధిక మద్దతు ఇవ్వాలి. 
  • సెక్షన్‌ 29హెచ్‌ సైగల భాషలో అనువాదంతో సబ్‌టైటిల్స్‌తో టీవీ కార్యక్రమాలు రూపొందించి బధిరులు పాల్గొనేటట్లు చూడాలి.
 
మరిన్ని వార్తలు