గిరిజన విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి

3 Mar, 2017 03:20 IST|Sakshi
గిరిజన విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి

ఉమ్మడి జిల్లా రీజినల్‌ డైరెక్టర్‌ రమేశ్‌
ఇచ్చోడ : గిరిజన విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని గిరిజన గురుకుల పాఠశాలు, కళాశాలల ఉమ్మడి జిల్లా రీజినల్‌ డైరెక్టర్‌ టి.రమేశ్‌ అన్నారు. గురువారం ఇచ్చోడ గిరిజన బాలికల పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేజీ టు పీజీ నిర్బంధ విద్యలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆరు నూతన గిరిజన గురుకుల బాలికల పాఠశాలలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఇంద్రవెల్లి, బోథ్, సిర్పూర్, తిర్యాణి, జైనూర్, ముథోల్‌ మండల కేంద్రాల్లోని ఈ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరానికి విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పాఠశాలల్లో బోధించేందుకు ఉపాధ్యాయల నియామకపు ప్రకియ కూడా ప్రారంభమైనట్లు తెలిపారు. జిల్లాలో ఆరు నూతన పాఠశాలలు, ఆరు పాత పాఠశాలల్లో ఐదో వతరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఐదో తరగతిలో ప్రవేశం కోసం ఎస్టీ విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రకియ ఫిబ్రవరి 16నుంచి మార్చి 16 వరకు కొనసాగుతుందని తెలిపారు. రూ.30 రుసుంతో ఆన్ లైన్ దరఖాస్తు చేసుకున్నవారు హాల్‌టికెట్లు డౌన్  లోడ్‌ చేసుకుని ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డివిజన్  స్థాయిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

ప్రతీ పాఠశాలలో 80 మంది విద్యార్థుల చొప్పున 12 పాఠశాలల్లో 960 మందికి ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రవేశం పొందిన విద్యార్థులకు గిరిజన గురుకులాల్లో ఇంగ్లిష్‌ మీడియంలో ఉచిత విద్య, వసతి కల్పించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 9న ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. 80శాతం సీట్లు ఎస్టీలకు కేటాయించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఎస్టీ విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. జిల్లా కోఆర్డినేటర్‌ గంగాధర్, ఇచ్చోడ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్‌ నారాయణ్‌నాయక్, బాలుర పాఠశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మణ్‌స్వామి, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ మారుతిశర్మ, ఆదిలాబాద్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ సాయిరాం పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు