పోలవరంపై ప్రత్యేక దృష్టి

27 Jan, 2017 02:26 IST|Sakshi
పోలవరంపై ప్రత్యేక దృష్టి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని, వచ్చే ఏడాదికి పనులు పూర్తి చేసి సాగు, తాగు జలాలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ తెలిపారు. స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన 68వ భారత గణతంత్ర దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. రూ.1,400 కోట్లతో పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టి.. రూ.660 కోట్ల విలువైన పనులు పూర్తిచేశామని కలెక్టర్‌ చెప్పారు. యనమదుర్రు, ఎర్రకాలువ ఆధునికీకరణ, పోగొండ రిజర్వాయర్, చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. నీరు–చెట్టు పథకం కింద రూ.62 కోట్లతో 480 చిన్నతరహా నీటి వనరుల్లో  171 లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడికతీత పనులు చేశామన్నారు. సాగులో యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహించి రూ.73 కోట్ల విలువైన యంత్రాలను 31 వేల మంది రైతులకు అందించామని వివరించారు. ఈ ఏడాది 4 లక్షల మంది రైతులకు రూ. 5,200 కోట్లను పంట రుణాలుగా అందిస్తున్నామన్నారు. 5 లక్షల మంది రైతులకు రూ.900 కోట్ల రుణమాఫీ చేశామని, 75 వేల మంది కౌలు రైతులకు రూ.22 కోట్లు పంట రుణాలుగా అందించామని తెలిపారు. రైతు కూలీల వలసలు నివారించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం కింద 2.78 లక్షల కుటుంబాలకు చెందిన 4.40 లక్షల మంది కూలీలకు 108 లక్షల పనిదినాలు కల్పించి రూ.152 కోట్లు వేతనాలుగా చెల్లించామన్నారు. జలసిరి పథకం కింద 1,500 వ్యవసాయ బోర్లు తవ్వి విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేశామని, వీటిలో 317 బోర్లకు సోలార్‌ విద్యుత్‌ పంప్‌ సెట్లు అమరుస్తున్నామని వివరించారు. జిల్లాలోని 47 వేల స్వయం సహాయక సంఘాలకు రూ.1,027 కోట్ల రుణాలను అందిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికీ రూ.149కే టెలిఫోన్, ఇంటర్నెట్, కేబుల్‌ ప్రసారాలు అందించే దిశగా చేపట్టిన ఫైబర్‌గ్రిడ్‌ పనులు పూర్తికావచ్చాయని చెప్పారు. జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు 1.81 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లను, వివిధ జాతీయ పథకాల నిధులు రూ.146 కోట్లతో సురక్షిత మంచినీటి పథకాలను నిర్మిస్తున్నామని వివరించారు. గృహనిర్మాణ పథకం కింద 18,504 గృహాలు, ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస  యోజన కింద 5,296 గృహాలు, ప్రధానమంత్రి పట్టణ ఆవాస యోజన కింద ఏలూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లుల్లో 1,910 గృహాలు నిర్మిస్తున్నామని తెలిపారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు పంట భూములను వినియోగించకుండా 16 వేల ఎకరాల అటవీ భూములను డీ నోటిఫై చేసి, వినియోగించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. వనం–మనం కార్యక్రమం కింద 93 లక్షల మొక్కలు నాటి వాటిని జియో ట్యాగింగ్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, ఈ ఏడాది మరో కోటి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఆర్‌ అండ్‌ బీ ఆధ్వర్యంలో రూ.344 కోట్లతో 82 పనులు చేపట్టామని, జిల్లాలో క్రీడా వికాస కేంద్రాల నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా రూ.9.50 కోట్లతో ఇండోర్‌ స్టేడియంలు నిర్మిస్తున్నామని తెలిపారు. రూ.350 కోట్ల అంచనా వ్యయంతో క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామన్నారు. కార్యక్రమంలో డీఐజీ పి.రామకృష్ణ, ఎస్పీ భాస్కర్‌భూషణ్, జేసీ పి.కోటేశ్వరరావు, అదనపు జేసీ ఎంహెచ్‌ షరీఫ్, ఏఎస్పీ కె.రత్న, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్, డీఆర్‌ఓ కే.హైమావతి, ఆర్‌డీఓ నంబూరి తేజ్‌భరత్‌ పాల్గొన్నారు. 
 
 
 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు