సొసైటీలకు ప్రత్యేక నిబంధనలు

6 Oct, 2016 01:57 IST|Sakshi
సొసైటీలకు ప్రత్యేక నిబంధనలు
  •  బీసీ కార్పొరేషన్‌ ఈడీ వెంకటస్వామి
  • నెల్లూరు (సెంట్రల్‌) : జిల్లాలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకునే 10 కుల సంఘాల సొసైటీలకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని ఈడీ వెంకటస్వామి తెలిపారు. నగరంలోని ఆయన కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, నగర (ఉప్పర), వాల్మీకి (బోయ), కృష్ణబలిజ (పూసల), బట్రాజు, కుమ్మరి (శాలివాహన), మేదర, విశ్వబ్రాహ్మణ సంఘాలకు సంబంధించి వారు గ్రూపులుగా రుణాలకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. గ్రూపునకు 11 నుంచి 15 మంది వరకు ఉండాలన్నారు. 2013 నుంచి 2016 సంవత్సరాల్లో రుణాలు పొందిన సంఘాలకు అర్హత లేదన్నారు. 2016లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుని రుణాలు రాని వారు మళ్లీ చేసుకోనవసరం లేదన్నారు. వాటినే పరిశీలిస్తామని తెలిపారు. ప్రధానంగా గ్రూపులో ఉన్న 15 మంది సభ్యుల్లో ఇద్దరు లేదా ముగ్గురు గ్రూపులోనే విడిగా యూనిట్‌ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. రుణ లబ్ధిదారుల నుంచి బయోమెట్రిక్‌ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం యూనిట్‌లో 50 శాతం సబ్సిడీ, 50 శాతం రుణంగా ఇస్తున్నట్లు తెలిపారు. బ్యాంక్‌ సబ్సిడీ మాత్రం రెండేళ్ల తర్వాతే జమ చేస్తామన్నారు. ఇతర వివరాలకు బీసీ కార్పొరేషన్‌ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
మరిన్ని వార్తలు