హోరెత్తిన హోదా పోరు

10 Sep, 2016 22:30 IST|Sakshi
హోరెత్తిన హోదా పోరు
* జిల్లాలో బంద్‌ విజయవంతం
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో నిర్వహణ
మద్దతు తెలిపిన సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలు
అన్ని వర్గాల ప్రజల సంఘీభావం
నిర్మానుష్యంగా మారిన రోడ్లు, వాణిజ్య సముదాయాలు
బంద్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర
జిల్లాలో 867 మంది అరెస్ట్‌
 
సాక్షి, గుంటూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం జిల్లాలో నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. జిల్లాలోని గుంటూరు నగరంతో పాటు అనేక నియోజకవర్గాల్లో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి చేరి బంద్‌ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఆర్టీసీ డిపోల ఎదుట ఆందోళనలు నిర్వహించడంతో బస్సులు రోడ్లపైకి రాలేదు. 
 
స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత...
జిల్లా అంతటా విద్య, వాణిజ్య, వ్యాపార సముదాయాలన్నిటినీ బంద్‌కు మద్దతుగా స్వచ్ఛందంగా మూసివేశారు. జిల్లాలో జరిగిన బంద్‌కు అన్ని వర్గాల ప్రజల నుంచి సంఘీభావం లభించింది. శనివారం మధ్యాహ్నం వరకు గుంటూరు నగరంతో పాటు, పలు పట్టణాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. వైఎస్సార్‌సీపీతో పాటు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూడా జిల్లాలో పలుచోట్ల బంద్‌ నిర్వహించారు. శనివారం నిర్వహించిన బంద్‌ శాంతియుతంగా జరిగింది.  
 
నియోజకవర్గాల వారీగా బంద్‌ ఇలా...
చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. ఉదయం నుంచి చిలకలూరిపేట పట్టణంలో వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించి బంద్‌ చేపట్టారు. 
 
  • గుంటూరు నగరంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి లే ళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున నాయకులు, కార్యకర్తలు భారీగా ఆర్టీసీ బస్టాండ్‌ వద్దకు చేరుకుని బంద్‌ నిర్వహించారు. కార్యక్రమంలో వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శులు నసీర్‌ అహ్మద్, లాలుపురం రాము, సహాయ కార్యదర్శి షేక్‌ గులాం రసూల్, కిలారి రోశయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు డైమండ్‌బాబు, పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. 
  • రేపల్లె నియోజకవర్గంలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. రేపల్లె బస్టాండ్‌ వద్ద బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. 
  • వేమూరు నియోజకవర్గంలో ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో వేమూరు, కొల్లూరు, చుండూరు మండలాల్లో బంద్‌ నిర్వహించారు. చుండూరు మండలం వలివేరు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. 
  • మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆర్టీసీ గ్యారేజీ వద్దకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. 
  • తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని శివకుమార్‌ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీగా తిరుగుతూ బంద్‌ నిర్వహించారు. 
  • పెదకూరపాడు నియోజకవర్గంలో క్రోసూరు, పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేట మండలాల్లో నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. 
  • వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ, శావల్యాపురం, ఈపూరు మండలాల్లో నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. 
  • గురజాల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో బంద్‌ జరిగింది.
  • సత్తెనపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సత్తెనపల్లి, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో బంద్‌ నిర్వహించారు.
  • పొన్నూరు నియోజకవర్గంలో సమన్వయకర్త రావి వెంకటరమణ ఆధ్వర్యంలో పొన్నూరు, పెదకాకాని, చేబ్రోలు మండలాల్లో బంద్‌ నిర్వహించారు. 
  • తాడికొండ నియోజకవర్గంలోని తుళ్లూరు, మేడికొండూరు మండలాల్లో నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర హెనీ క్రిస్టినా, సురేష్‌కుమార్‌ల ఆధ్వర్యంలో బంద్‌ జరిగింది. 
  • బాపట్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో బంద్‌ను విజయవంతం చేశారు. 
  • మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు యేళ్ల జయలక్ష్మి, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో బంద్‌ నిర్వహించారు. 
  • ప్రత్తిపాడు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మండల కన్వీనర్లు ఆధ్వర్యంలో బంద్‌ను విజయవంతం చేశారు.

 

>
మరిన్ని వార్తలు